విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం….

విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం….
మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన అగ్ని మాపక సిబ్బంది.
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఘటన ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మత్తులు చేసేందుకు సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కరెంట్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు వినియోగదారులకు సమాచారమిచ్చారు.

సిబ్బంది విద్యుత్ ను నిలిపివేసేందుకు బ్రేకర్స్ ను ఓపెన్ చేసే సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయని ఘటన ప్రదేశంలో ఉన్న సిబ్బంది వెల్లడించారు.వేసవి ఎండల తీవ్రత కారణంగా సబ్ స్టేషన్ ఆవరణలోని ఎండిపోయిన చెట్లు, చెత్త చెదారంకు నిప్పురవ్వలు అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను గుర్తించిన జూలూరుపాడు విద్యుత్ శాఖ లైన్ మెన్ నల్లగట్ల భాస్కర్ సబ్ స్టేషన్ సమీపంలోని కొంతమంది కార్మికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అగ్ని ప్రమాద సమాచారాన్ని కొత్తగూడెం కేంద్రంలోని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్ని మాపక శకటం విద్యుత్ ఉప కేంద్రానికి చేరుకుని వాటర్ గన్ ద్వారా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖ సిబ్బంది మంటలను గుర్తించి సత్వరమే సహాయక చర్యలు చేపట్టడంతో విద్యుత్ సబ్ స్టేషన్ కు భారీ నష్టం తప్పింది.
