Power lines | ఇళ్ల మధ్యలో విద్యుత్ స్థంభాలు, లైన్లు
Power lines | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లంబడితండా గ్రామంలో ఇళ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్థంభాలు, విద్యుత్ లైన్లు(Power lines) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తీవ్ర ఆటంకంగా మారాయి. దీంతో పేద లబ్ధిదారులు నెలల తరబడి ఇళ్ల నిర్మాణం చేపట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఈ లంబడితండా కాలనీలో 100కు పైగా నివాస గృహాలు ఉండగా, సుమారు 500కు పైగా గిరిజన (లంబాడా తెగ) ప్రజలు నివసిస్తున్నారు. ఈ కాలనీకి ప్రభుత్వం ఆరు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో మూడు ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉండగా, మిగిలిన మూడు ఇళ్ల నిర్మాణం(house construction) విద్యుత్ స్థంభాలు, విద్యుత్ తీగలు ఇళ్ల మధ్యగా వెళ్లడం వల్ల పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు.
గత రెండు నెలలుగా కొన్ని ఇళ్లు కేవలం బేస్మెంట్ (భీముల) స్థాయి వరకే నిర్మించగా, మరికొన్ని పూర్తిగా అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. ఇళ్ల మధ్యగా, నడుముగా విద్యుత్ లైన్లు ఉండటం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లు నిర్మించుకోవడం సాధ్యం కాదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఈ విద్యుత్ స్థంభాలు, లైన్లు శాపంగా మారాయని పేర్కొంటూ, వెంటనే వాటిని తొలగించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తగిన సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్‌ను లంబడితండా గ్రామ ప్రజలు కోరుతున్నారు.

