యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి

యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి

కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి విశ్వవిద్యాలయ నమోదుల అధికారిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తపాలా కార్డుల ద్వారా రాష్ట్ర ఉన్నత విద్య ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు పంపించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. నాగార్జున, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌. శరత్‌కుమార్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె. రమణ, విప్లవ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బి. నాగరాజు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయ నమోదుల అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాసంస్థ వివాదాలకు కేంద్రంగా మారిందని వారు ఆరోపించారు. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పట్టించుకోకుండా వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో జరిగే పనులన్నింటిలో జోక్యం చేసుకుంటూ పనుల కేటాయింపుల్లో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయ నిధులను మరమ్మత్తులు, ఇతర పనుల పేరుతో ఖర్చు చేస్తూ ఖజానాను ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. పట్టభద్రుల మహాసభ నిర్వహణలో లెక్కల పరిశీలన లేకుండానే లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వాటి వివరాలు ఇప్పటికీ వెల్లడించలేదని తెలిపారు. అలాగే విద్యాశిక్షణ కళాశాలల యాజమాన్యాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని అనుమతులకు సంబంధించిన ప్రమాణపత్రాల ధృవీకరణను విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నమోదుల అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అక్రమాలు జరిగాయని, ప్రస్తుతం జరుగుతున్న మహా లెక్కల పరిశీలకుల లెక్కల పరిశీలనను నిష్పక్షపాతంగా నిర్వహిస్తే అవినీతి యటపడుతుందని పేర్కొన్నారు.

ఏడాది కాలం గడిచినా విశ్వవిద్యాలయ అభివృద్ధికి గణనీయమైన చర్యలు కనిపించలేదని విమర్శించారు. ఈ విషయంపై పలుమార్లు విశ్వవిద్యాలయ ఉపకులపతికి వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వెంటనే స్పందించి నమోదుల అధికారిని పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విస్తృత స్థాయిలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply