Polling is over | బెల్లంపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Polling is over | బెల్లంపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న 33,350 మంది ఓటర్లు
74.85 శాతం పోలింగ్‌తో హీటెక్కిన రాజకీయ వాతావరణం
ఉత్సాహంగా తరలివచ్చిన ఓటర్లు.. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ

Polling is over | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలోని 34 వార్డులకు గాను అభ్యర్థుల గెలుపోటములను ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొనగా, మున్సిపాలిటీ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఉత్సాహంగా మారింది. మొత్తం 44,554 మంది ఓటర్లు ఉన్న బెల్లంపల్లి మున్సిపాలిటీలో 33,350 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెరసి 74.85 శాతం పోలింగ్ నమోదవడం ప్రజాస్పందనకు స్పష్టమైన సూచనగా నిలిచింది. యువత, మహిళలు, వృద్ధులు సమానంగా పోలింగ్‌లో పాల్గొనడంతో ప్రజాస్వామ్య పండుగ వాతావరణం నెలకొంది.


పోలింగ్ ప్రక్రియ అంతటా ప్రశాంతత కొనసాగింది. ఎక్కడా గొడవలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకపోవడంతో ఎన్నికల యంత్రాంగం సంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం 68 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా చర్యలు చేపట్టడంతో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ సజావుగా పూర్తయ్యింది. భారీ పోలింగ్ శాతం నమోదవడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. కీలక స్థానాల్లో ఓటింగ్ శాతం ప్రభావం ఫలితాలపై ఎలా పడుతుందన్న చర్చలు సాగుతున్నాయి. భారీ ప్రజాస్పందన, ప్రశాంత వాతావరణం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసిన బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఫలితాల దశకు చేరుకున్నాయి. ఓటర్ల తీర్పు ఎవరి పాలిట పడిందో తెలుసుకోవాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

వార్డుల వారిగా పోలింగ్ తీరు..


మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా తొలి వార్డులో 1406 మంది ఓటర్లు ఉండగా, అందులో 1153 మంది ఓటేశారు. 2వ వార్డులో అత్యధికంగా 1475 మందికి గాను 1204 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 3వ వార్డులో 1363 మంది ఓటర్లలో 1151 మంది తమ హక్కును చాటుకున్నారు. 4వ వార్డులో 1377 మందికి 943 మంది, 5వ వార్డులో 1125 మందికి 918 మంది ఓటేశారు. 6వ వార్డులో 1312 మంది ఓటర్లకు 1011 మంది, 7వ వార్డులో 1262 మందికి 979 మంది, 8వ వార్డులో 1333 మందికి 1034 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 9వ వార్డులో 1352 మందికి 963 మంది, 10వ వార్డులో 1056 మందికి 798 మంది ఓటేశారు.

11వ వార్డులో 1277 మంది ఓటర్లకు 896 మంది, 12వ వార్డులో 1571 మందికి 1110 మంది, 13వ వార్డులో 1369 మందికి 1156 మంది ఓటు వేశారు. 14వ వార్డులో 1248 మందికి 935 మంది, 15వ వార్డులో 1273 మందికి 978 మంది, 16వ వార్డులో 1278 మందికి 913 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. 17వ వార్డులో 1292 మంది ఓటర్లకు 1047 మంది, 18వ వార్డులో 1393 మందికి 1033 మంది తమ ఓటు వేశారు. 19వ వార్డులో 1339 మందికి 1022 మంది, 20వ వార్డులో 1370 మందికి 1001 మంది, 21వ వార్డులో 1214 మందికి 937 మంది తమ తీర్పును వెల్లడించారు.


22వ వార్డులో 1288 మంది ఓటర్లకు 916 మంది, 23వ వార్డులో 1412 మందికి 812 మంది, 24వ వార్డులో 1353 మందికి 1091 మంది, 25వ వార్డులో 1403 మందికి 1101 మంది ఓటేశారు. 26వ వార్డులో 1398 మందికి 907 మంది, 27వ వార్డులో 1316 మందికి 965 మంది, 28వ వార్డులో 1101 మందికి 799 మంది ఓటు వేశారు. 29వ వార్డులో 1296 మంది ఓటర్లకు 842 మంది, 30వ వార్డులో 1124 మందికి 826 మంది ఓటేశారు. చివరి నాలుగు వార్డుల్లోనూ ఓటర్లు భారీగా తరలివచ్చారు.

31వ వార్డులో 1361 మందికి 1065 మంది, 32వ వార్డులో 1349 మందికి 1029 మంది, 33వ వార్డులో 1264 మందికి 943 మంది, చివరిగా 34వ వార్డులో 1204 మంది ఓటర్లకు గాను 916 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 68 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ శాతం గణనీయంగా పెరగడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

బెల్లంపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి దంపతులు
బెల్లంపల్లి బజార్ ఏరియా స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ భూత్ లో ఓటు వేసేందుకు లైన్లో ఉన్న మహిళ ఓటర్లు
ఓటు హక్కు వినియోగించుకున్న రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పులియాల రాయమల్లు
ఓటు హక్కు వినియోగించుకున్న 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని చింతల వసంత
ఓటు హక్కు వినియోగించుకున్న 7 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని దావ స్వాతి రమేష్ బాబు

Leave a Reply