Polling Day | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం … రేపే పోలింగ్

70 స్థానాల‌కు ఎన్నిక‌లు
ఓటు వేయ‌నున్న‌ 1.55 కోట్ల వ‌యోజ‌నులు
బీజేపీ, ఆప్, క్రాంగ్రెస్ మ‌ధ్య త్రిముఖ పోటీ..
ప్ర‌చారంలో ముందంజ‌లో బీజేపీ
ఆప్ సైతం దూకుడు..
పోలింగ్ నేప‌థ్యంలో అణువణువునా గస్తీ..
మొత్తం 35వేల మంది పోలీసుల మోహ‌రింపు
హాట్ స్పాట్ లలో భారీగా బందోబస్తు
ముమ్మరంగా వాహనతనిఖీలు
డ‌బ్బు పంపిణీని అడ్డుకునేందుకు ప్ర‌త్యేక దృష్టి
సీసీ కెమెరాలతో నిరంతర నిఘా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు రేపు ఓటింగ్‌ జరగనుంది. ఒక కోటీ 55 లక్షల మంది ఓటర్లు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు వేయనున్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఢిల్లీలో గరిష్ట ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్ద ఎంత జనసమూహం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. కాగా, ఈ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ నెల 8వ తేదిన చేప‌ట్టి అదే రోజున ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు..

ఆప్, బీజేపీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్..
ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్‌కు ఇక్కడున్న బలమైన ఉనికి ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చింది. 2015లో 67, 2020లో 62 శాసనసభ స్థానాలు గెలుచుకున్న ఆప్‌ ఈసారి కూడా అదే దూకుడు ప్రదర్శించగలమన్న ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో బిజెపి కేవలం ఎనిమిది సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఒకప్పుడు దేశ రాజధానిలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్‌కు ఓటర్లు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 2015 ఎన్నికల్లో బిజెపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి.

ప్ర‌చారంలో యోధానుయోధులు..
ఇక ఈ ఎన్నిక‌ల‌లో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అతిషి నియోజకవర్గంలో మూడు ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల్కాజీ, కస్తూర్బా నగర్‌లలో రోడ్ షో చేశారు.

35 వేల పోలీసులు మోహరింపు
కాగా పోలింగ్ నేప‌థ్యంలో పోలీసులు, భద్రతా దళాలను ఢిల్లీ అంతటా మోహరించారు. ఢిల్లీ పోలీసులు సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. 35 వేలకు పైగా పోలీసులను ఎన్నికల విధుల్లో నియమించారు. 220 కంపెనీల కేంద్ర రిజర్వ్ దళాలను కూడా భద్రత కోసం రంగంలోకి దింపారు. 19 వేల మంది హోమ్ గార్డ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు ఢిల్లీ విడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ‌బ్బు పంపిణిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.. పోలింగ్ ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంది.. పోలింగ్ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఢిల్లీలో సిసి కెమెరా సెల్ ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *