జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్‌హాట్ కామెంట్స్
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : తాను పాలిటిక్స్ పక్కా చేస్తానని, అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే తన ధ్యేయమని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పాలకపక్షం, ప్రతిపక్షం బిజీగా ఉన్నాయని, ప్రజాసమస్యలపై తాను ప్రశ్నిస్తున్నానని, నిరంతరం ప్రశ్నిస్తానని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ రోజు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మట్లాడారు. ఆమె మాటల్లో!
- మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలి. స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్లీ మొదలు పెట్టాలి. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుంది. లేకుంటే పొలిటిషియన్ పిల్లలు, వాళ్ల బంధువులే రాజకీయాల్లోకి వస్తారు.. ఇప్పుడు కూడా వస్తున్నారు. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి.
- నాలో ప్రశ్నించేతత్వం మారలేదు. రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాయి. ప్రజల తరఫున అడిగేటోళ్లు లేరు. అందుకు తాము ఆ పని చేస్తున్నాం. జూబ్లీహిల్స్ చిన్న ఎన్నిక. ఈ ఎన్నికల్లో మాకు ఏ స్టాండ్ లేదు.
- బీసీల విషయంలో తమ కమిట్ మెంట్ కొనసాగుతుంది. బీసీలకు చట్ట సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం రావాలన్నదే తన లక్ష్యం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు మొదటి అడుగు మాత్రమే.
- ఇరవై ఏళ్లు బీఆర్ఎస్ లో పనిచేస్తే తనను అవమానకరంగా బయటకు పంపించారు. కనీసం తనకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు.
తాను తెలంగాణ బిడ్డనే. ఆకలినైనా తట్టుకుంటా. అవమానాన్ని మాత్రం తట్టుకోను. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తాను. కానీ పొలిటకల్ గా మాత్రం వెళ్లను. పొలిటికల్ గా పిలిస్తే వెళ్లే పరిస్థితి దాటి పోయింది. పొలిటికల్ గా బీఆర్ఎస్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు. - విప్లవాత్మక మార్పు జరిగినప్పుడు కొంతమందికి నష్టం జరగవచ్చు. తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడే రాజకీయం చేయాలనుకోవటం లేదు. సమస్యలపైనే పోరాటం చేస్తాను. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనను నిజామాబాద్ లో పరిమితం చేశారు. ప్రోటోకాల్ అనే తాడుతో తనను కట్టడి చేశారు. ఉద్యమంలో బతుకమ్మ సంబరాల్లో తెలంగాణలోని ప్రతి పల్లె తిరిగాను.
- ఆడపిల్లలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తా. పాలిటిక్స్ పక్కా చేస్తా. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తున్నాం.
- తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరవలేనిది. ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా. వరంగల్ అనగానే తనకు ప్రొఫెసర్ జయశంకర్ గుర్తుకు వస్తారు. జాగృతి సంస్థకు ఆయన స్ఫూర్తి. తమకు మార్గదర్శనం చేసిన వారు. తెలంగాణ వ్యక్తులు రాజులకు, రాజ్యాలకు భయపడరు. మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన రాణి రుద్రమ గడ్డ ఇది. సమ్మక్క, సారలమ్మ ల గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. తమ పర్యటన ములుగు జిల్లాకు వెళ్లేసరికి సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది.
- తన పర్యటనతో చాలా మంది జాగృతి గత పదేళ్లలో ఏం చేసిందని అడగవచ్చు? కానీ పదేళ్లలో కూడా ఇంటర్నల్ గా సమస్యలపై కొట్లాడాను. అయితే కేంద్రంలో మూడు సార్లు గెలిచిన బీజేపీ తో మనకు పైసా పని కాలేదు. ఒక్క పెద్ద సమస్యను కూడా వాళ్లు తీర్చలేదు.
- వరంగల్ అంటే రైల్వే హబ్. అలాంటి వరంగల్ లో కూడా పెద్ద సమస్యను తీర్చలేదు. బీఆర్ఎస్ పదేళ్లలో పాలనలో కొన్ని మంచి పనులు చేసుకున్నాం. కానీ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉంది. ఏ సమస్యలపై విమర్శలు చేసి అధికారంలోకి వచ్చారో… ఆ సమస్యలన్నీ అలాగే పెండింగ్ లో ఉంచారు. అందుకే మనం తెలంగాణ బిడ్డలుగా ఆలోచన చేయాలి. తాను ఓట్లు అడగటానికి రాలేదు. ఎన్నికల సంవత్సరం మాత్రమే రాజకీయాలు చేయాలి. మిగతా నాలుగేళ్లు అభివృద్ధి జరగాలి. అది జరగాలంటే అడిగే వాళ్లు ఉండాలి. ఆ అడిగే బాధ్యత తమ జాగృతి సంస్థ చేస్తుంది.
- బీఆర్ఎస్ లో నేను మంత్రిని కాదు. కానీ నా వద్దకు వచ్చిన వారికి శక్తిమించి పనులు చేసేందుకు ప్రయత్నించా. సీకేఎం కాలేజ్ ప్రొఫెసర్ గంగాధర శర్మ ని అడగండి. ఆ కాలేజ్ ను ప్రభుత్వ కాలేజ్ చేయాలని ప్రయత్నించిన కాలేదు. సీఎం కూతురిని అయినప్పటికీ నాకే పని కావటానికి ఏడాది పట్టింది. ఆ విధంగా నన్ను కట్టిడి చేసినప్పటికీ…ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. బీఆర్ఎస్ నుంచి నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమ, అవగాహనతో పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాను.

