గ్రామాల్లో దాడులకు సై ..

తెరమీదకు  రాజకీయ దాడులు

టీడీపీ కార్యకర్తపై వైసీపీ కేడర్​ దాడి

బొబ్బర్లంకలో ఉద్రిక్తత

రంగంలో దిగిన పోలీసులు

( ఆంధ్రప్రభ, మోపిదేవి ) పల్లెల్లో రాజకీయ అలజడి రాజుకుంది. కక్షలు, కార్పణాల సెగలు తారా స్థాయికి చేరుతున్నాయి. దివిసీమలో రాజకీయ రగడ తారాస్థాయికి చేరుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం  మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త యలమంచిలి సురేష్ పై  బొబ్బర్లంక గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు వెదురు మంచం పట్టెతో దాడి చేశారు.  హత్యకు ప్రయత్నించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బొబ్బర్లంక గ్రామంలో ఉద్రిక్తత రేపింది.  వ్యవసాయ కూలీ యలమంచిలి సురేష్ పాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. బొబ్బర్లంక గ్రామంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవానికి సమీప బంధువులు పిలవటంతో ఊరేగింపు ముగించుకుని కొక్కిలిగడ్డలోని తన  ఇంటికి వచ్చాడు. పాలు అమ్మకానికి బొబ్బర్లంక గ్రామానికి వెళ్లగా,  వైసీపీ శ్రేణులు మైలా శివకుమార్, పీతా నవీన్ అనే ఇరువురు వ్యక్తులు రహదారిపై అడ్డగించి దాడి చేశారు.  సురేష్ చెయ్యి విరిగింది.  మెడపై బలమైన దెబ్బలు తగలటంతో సమీపంలోని  గ్రామస్తులు దాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.  హుటాహుటిన 108 అంబులెన్స్ లో  అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  వైద్యులు చెయ్యి విరిగి మెడ వద్ద బలమైన గాయమైనట్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు బాధితుడు సురేష్ తెలిపారు. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త సురేష్ ను దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, బొబ్బర్లంక టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, కోనేరు నాని పరామర్శించారు. గతంలో గ్రామంలో పలు వివాదాలకు సంబంధించి నిందితులు శివకుమార్, నవీన్ లు ఉండగా, గ్రామస్థులు వీరిపై పోలీసు స్టేషన్​ లో  ఫిర్యాదు చేశారు. ఇటీవల వారం రోజుల కిందట  గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు అరవింద్ కొక్కిలిగడ్డ గ్రామంలోని సురేష్ బంధువుల ఇంటికి వచ్చి శివకుమార్, నవీన్ అనే వ్యక్తులు త్వరలో సురేష్ ను చంపేస్తారని వార్నింగ్ ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. గ్రామస్థులు అడ్డుకోని పక్షంలో సురేప్ ని చంపేసేవారని, ఇప్పటికైనా పోలీసులు తగ్గు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply