70 మందిని కాపాడిన నంద్యాల పోలీసులు
( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) నల్లమల్ల అడవిలో భారీ వర్షంతో.. సిద్దాపురం చెరువు పొంగి రోడ్డు పైకి నీరు చేరిన తరుణంలో.. అలుగుపై నీరు పరవళ్లు తొక్కుతుండగా..త్వరగా అలుగు దాటాలనే తొందరలో బస్సును ముందుకు నడపటంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డులో 70 మంది ప్రయాణికులు బతికి బట్టకట్టగలిగారు. సకాలంలో పోలీసులు స్పందించటంతో.. ఈ దుర్ఘటనకు శుభం కార్డు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. భారీ వర్షం నేపథ్యంలో సిద్ధాపురం చెరువు నిండిపోయింది.

నీరు అలుగుపై పరవళ్లు తొక్కుతోంది. ఈ అలుగుపై రాకపోకలతో ప్రమాదాన్ని పసిగట్టిన పోలీసులు ఆత్మకూరు నుంచి దోర్నాలకు పోయే రోడ్డును మూసివేశారు. సిద్దాపురం అలుగుపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో కర్ణాటక బస్సు అక్కడకు చేరింది. అక్కడ ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బంది పడతారని డ్రైవర్ ఆ బస్సును ముందుకు నడిపాడు.. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతని ఆపారు. ప్రమాదాన్ని నివారించారు.ఈ రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ కారు , ఆరు లారీలు ను పోలీసులు నిలిపివేశారు. డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆత్మకూరు తాహసీల్దారు, సీఐ పోలీస్ సిబ్బంది వాహనాలన్నిటిని ఆపేశారు. బస్సులోని 35 మంది ప్యాసింజర్లతో పాటు మిగిలిన 35 మందితో కలిపి 70 మంది ని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు తరలించారు.70 మంది ప్రయాణికులకు భోజన వసతి సౌకర్యం కల్పించారు. కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా దోర్నాలకు వెళ్లే వాహనాలన్నింటిని కూడా నంద్యాల గిద్దలూరు మీదుగా వెళ్లాలని పోలీసులు దారిమళ్లించారు.

