ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి : మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం పెరిగింది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం.. మచిలీపట్నంలో టెన్షన్ టెన్షన్ గా మారింది. కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మచిలీపట్నం డీఎస్పీ రాజా ఆధ్వర్యంలో పోలీసులు మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల ముందు భారీగా మొహరించారు.
ర్యాలీలకు నిరసన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపినప్పటికీ అవేమీ లెక్క చేయకుండా కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వైసీపీ జిల్లా, నియోజకవర్గ నేతలు ఒక్కసారిగా మచిలీపట్నం రావడంతో ఆందోళన పెరిగింది. మెడికల్ కళాశాల వద్ద వైసీపీ నేతలు ముందు లోపలికి అనుమతించాలని కళాశాలను చూసి వచ్చేస్తామని చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా అడ్డుకోవడంతో మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.
అనంతరం రహదారి మీద కూర్చుని నిరసన తెలిపారు. శాంతియుతంగా కళాశాలను చూసి వస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు వినకపోవడం పట్ల మాజీ మంత్రి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపి ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి నియోజకవర్గం నుంచి ర్యాలీగా వస్తున్న క్రమంలో కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని లాఠీచార్జి చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ ను సైతం మచిలీపట్నంలో పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.

