Police force | సూపర్ పోలీస్..

Police force | సూపర్ పోలీస్..
- సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం అభినందనీయం
- జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు
Police force | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సమాజసేవలో పోలీసుల భాగస్వామ్యం అభినందనీయమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు చెప్పారు. విధి నిర్వహణతో పాటు సమాజ సేవ(Community service)లు చేస్తున్న పలువురు పోలీసులను ఎస్పీ తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు.
ఇటీవల రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వై.వెంకటరత్నం.. స్కూలు వదిలిన సమయంలో కొంత మంది పేద విద్యార్థులు మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై వెళుతుండటాన్ని చూసి అందరికీ తన సొంత ఖర్చులతో పాదరక్షలు కొనిపెట్టి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా(social media)లో హల్‌చల్ అయ్యింది.
అలాగే ఆర్పేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ (బందర్ సబ్ డివిజన్ డ్రోన్ ఆపరేటర్)గా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణ మూర్తి (పీసీ-1832) తన పుట్టినరోజును అందరి మధ్య ఆడంబరంగా చేసుకోకుండా శీతాకాలంలో చలికి గజగజలాడుతున్న యాచకులకు రగ్గులు, దుప్పట్లును అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్పీ… వెంకటరత్నం, కృష్ణ మూర్తిలను తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల్లో సేవాభావం అనేది ఎప్పుడూ ఉంటుందన్నారు. పైకి గాంభీర్యం కనిపించే పోలీసులను మాత్రమే చూస్తారన్నారు. ప్రజాభద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కూడా ప్రజల కోసం పోలీసులు చేసే సేవా కార్యక్రమాలేనని చెప్పారు. మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం(Police force) ప్రజలకు మరింత దగ్గరవుతుండటం సంతోషంగా ఉందన్నారు. వెంకటరత్నం, కృష్ణమూర్తిలను పోలీసు శాఖలోని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
