Police | కోడిపందేల శిబిరం పై దాడి..

Police | కోడిపందేల శిబిరం పై దాడి..

  • 27మంది పందెం రాయుళ్ల అరెస్ట్..
  • రెండు కార్లు, 30 మోటార్ సైకిళ్లు, 16 మొబైల్స్ స్వాధీనం..

Police, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మామిడి తోటల్లో కోడిపందేల శిబిరం పై మంగళవారం సాయంత్రం పోలీసులు మెరుపుదాడి నిర్వహించి 27 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. అవనిగడ్డ శివారు బందలాయిచెరువు సమీపంలోని మామిడి తోటల్లో జనసేన పార్టీకి చెందిన ఓ ద్వితీయశ్రేణి నేత నేతృత్వంలో గడిచిన కొద్ది నెలలుగా వారం వారం కోడిపందేలు నిర్వహిస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఎస్పీ (DSP)తాళ్లూరి విద్యశ్రీ నేతృత్వంలో పోలీసులు పక్కా ప్రణాళికతో మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 27 మంది పందెం రాయుళ్లు అరెస్ట్ కాగా, రెండు కార్లు, 30 మోటార్ సైకిళ్లు, 16 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం సాయంత్రం డీఎస్పీ ఆదేశాలతో పోలీసులు ట్రావెల్స్ వ్యాన్లో యాత్రికుల వలె పందెం జరిగే ప్రదేశాలకు వెళ్లి ఒక్కసారిగా వారిని చుట్టుముట్టి పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. జనసేన పార్టీకి చెందిన నేత నిర్వహిస్తున్న శిబిరం కావటంతో దాదాపు రెండు గంటల పాటు పోలీసులకు, నిర్వాహకులకు నడుమ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిడిలను అధిగమించి పోలీసులు పందెపు రాయుళ్లను, వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మోపిదేవి, నాగాయలంక, అవనిగడ్డ పోలీసులు కలిసికట్టుగా ఈ దాడులను నిర్వహించి పెద్దసంఖ్యలో పందెంపురాయుళ్లను అరెస్ట్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవటంతో ఈ ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply