నస్పూర్, జులై 15(ఆంధ్రప్రభ) : నెంబర్ ప్లేట్ లేని వాహనదారులపై పోలీసులు (police) కొరడా జులిపిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నస్పూర్ పట్టణంలోని సీసీసీ కార్నర్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. భారీగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ (ACP R. Prakash) మాట్లాడుతూ… వాహనాలకి నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రోడ్డు ఎక్కడం నేరమని, ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు.
రోడ్డు భద్రత నియమాల (Road safety rules) ను అతిక్రమిస్తూ పోలీసుల నుంచి, రక్షణ వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకే ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్లను తొలగిస్తున్నారన్నారు. కొంతమంది వాహనదారులు అతితెలివితో నెంబర్ ప్లేట్లను సగం విరిచేయడం, నెంబర్లు స్పష్టంగా కనిపించకుండా చేయడం అలాంటివి చేస్తున్నారని, ఇకపై ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కేవలం పోలీసుల చలానాల నుండి తప్పించుకునేందుకు కొంతమంది ఇలా చేస్తుండగా, దొంగతనాలు, దోపిడీలకు, మరికొందరు పాల్పడుతున్నారన్నారు.
బాధ్యత గల పౌరులుగా వాహనదారులందరూ విధిగా రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఇకపై వాహనదారులు నియమాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, సీసీసీ నస్పూర్ ఎస్ఐ యు. ఉపేందర్ రావు, ప్రత్యేక పోలీస్ బృందాలు పాల్గొన్నారు.
