యువకుడి పై పోక్సో కేసు నమోదు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉరుసు హరిజనవాడ ఎస్సీ కాలనీలో కిరాణా షాప్ నడుపుతున్న వేల్పుగొండ కుమారస్వామి కుమారుడు కమల్ అనే వ్యక్తి, అదే కాలనీలో నివసించే 8 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బుధవారం బయటపడింది.
మంగళవారం సాయంత్రం వారు పాపను కూల్‌డ్రింక్ తీసుకురమ్మని షాపుకు పంపారు. కొద్ది సమయానికి బాలిక ఏడుస్తూ ఇంటికి రావడంతో ఏమైందని అడగగా, షాపుకు వెళ్లినప్పుడు కమల్ ఒక్కడే ఉన్నాడని, తనకు కూల్‌డ్రింక్ ఇవ్వకుండా చాక్లెట్ ఆశ చూపుతూ ముద్దులు పెట్టుకున్నాడని తెలిపింది. అదే సమయంలో షాపులోకి మరో వ్యక్తి రావడంతో కమల్ వదిలిపెట్టగా, బాలిక అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంటికి చేరి తల్లిదండ్రులకు వివరాలు తెలిపింది.
వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిల్స్ కాలనీ పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు.
