ఇళ్లు.. దేవాలయాలే టార్గెట్

ఇళ్లు.. దేవాలయాలే టార్గెట్

  • ఏసీపీ జి కృష్ణ

పాలకుర్తి, ఆంధ్రప్రభ : గ్రామాల్లో చోరీలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ సూచించారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తన్నే ముట్టి సాయి (28) బసంత్ నగర్ రామాలయంలో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడన్నారు. ఈ నెల 28వ తేదీన బసంత్ నగర్ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగిన విషయం వెలుగులోకి రాగా, బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని విచారణలో నిందితుడు తన్నే ముట్టి సాయిగా గుర్తించినట్లు తెలిపారు.

బుధవారం బసంత్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీటులో ఏసీపీ జి కృష్ణ మాట్లాడారు. సాయి గత పది సంవత్సరాలుగా నెరస్థుడిగా మారి ఇళ్లు, దేవుడి గుళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడని, ఇతనిపై ఇప్పటికే 12 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి చోరికి గురైన బంగారు పుస్తెలు, మూడు వెండి కిరీటాలు, రెండు వెండి హస్తాలు, ఎనిమిది వెండి కళ్ళు, వెండి పట్టి నామాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

తాజా కేసులో కీలక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెర్కొన్నారు. గ్రామాల్లో చోరీల నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ఇంట్లో విలువైన వస్తువులను తప్పనిసరిగా లాకర్‌లో భద్రపరుచుకోవాలని ఏసీపీ సూచించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎస్ఐ నూతి శ్రీధర్, కానిస్టేబుల్ శ్రీనివాస్, శరత్, ఫింగర్ ప్రింట్ కానిస్టేబుల్ రాజేష్‌లను ఏసీపీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నూతి శ్రీధర్ పాల్గొన్నారు.

Leave a Reply