ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలి..

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలి..

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల వారీగా పర్యటిస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం,చెత్త వర్గీకరణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా యువత, మహిళా సంఘాలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని, ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply