petition | ప్రారంభోత్సవాల్లో వినతుల వెల్లువ

petition | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ మున్సిపల్ పరిధిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు సరికొత్త ప్రజా ప్రతిపాదనలకు వేదికయ్యాయి. నందిగామ సర్వతోముఖాభివృద్ధికి, ముఖ్యంగా విద్యారంగ విస్తరణకు విశేషంగా కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే, దివంగత తంగిరాల ప్రభాకర్ రావు గుర్తుగా పలు ప్రాంతాలకు ఆయన పేరు పెట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి లోకం నుంచి పెద్దఎత్తున వినతులు అందాయి.

petition

పాలిటెక్నిక్ కళాశాల ఎదుట‌ ఉన్న ఓల్డ్ బైపాస్ రోడ్డు, 16వ వార్డులో నూతనంగా నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ‘ఓల్డ్ బైపాస్’గా పిలవబడుతున్న ఈ రోడ్డుకు తగిన గుర్తింపు కల్పించడంతో పాటు, పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి, పరిసర ప్రాంతాల పురోగతిలో ప్రభాకర్ రావు చేసిన సేవలకు గౌరవ సూచికగా ఆ రోడ్డుకు తంగిరాల ప్రభాకర్ రావు మార్గ్ గా నామకరణం చేయాలని వారు ముక్తకంఠంతో కోరారు.

ఇదే విధంగా హనుమంతుపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రజలు కూడా తమ కాలనీకి సామాజిక వర్గాల పేర్లకంటే, ఆ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడి పేరు పెట్టడం గౌరవప్రదమని పేర్కొన్నారు. తమ కాలనీకి తంగిరాల ప్రభాకర్ రావు కాలనీగా నామకరణం చేయాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ప్రజల వినతులపై స్పందించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రజలు తమ నాయకుడిపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

petition

పాలిటెక్నిక్ కళాశాల స్థాపన నుంచి మౌలిక వసతుల అభివృద్ధి వరకు ప్రభాకర్ రావు చేసిన కృషి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందనడానికి ఈ వినతులే నిదర్శనమని అన్నారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ, ఈ ప్రతిపాదనలను మున్సిపల్ అధికారులకు పంపించి, నిబంధనల ప్రకారం సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply