petition | అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్

petition | అక్రమ అరెస్ట్‌పై స్పీకర్‌కు ప్రివిలైజ్ మోషన్
- పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోండి
- స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
petition | హుజురాబాద్, ఆంధ్రప్రభ : తన హక్కులకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ప్రివిలేజ్ మోషన్ కింద వినతిపత్రం అందజేశారు. ఇవాళ హైదరాబాద్ లో స్పీకర్ ను కలిసి కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో గురువారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా కరీంనగర్ జిల్లా సీపీ, ఏసీపీ, సీఐలు కలిసి అక్రమంగా అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతల పవిత్ర జాతరలో పాల్గొంటున్న సమయంలో, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ తనను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుడిపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీస్ యంత్రాంగం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ఘటన శాసనసభ హక్కులను, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై ప్రివిలైజ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్రమైన సమ్మక్క, సారక్క జాతరను రాజకీయ ప్రయోజనాల కోసం భంగపెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో కరీంనగర్ సీపీ, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐలు చట్టాన్ని ఉల్లంఘించి హక్కులను కాలరాస్తున్నారన్నారు.
