KNL | నక్షా తో భూములకు శాశ్వత రక్ష.. ఎమ్మెల్యే గౌరు చరిత

కర్నూలు బ్యూరో : నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు, కేంద్ర ప్రభుత్వ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (ఎన్ఏకేఎస్ హెచ్ఎ- నక్షా) కార్యక్రమం శాశ్వత రక్షణ ఇస్తుందని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త బి.సి. పరిదా అన్నారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సచివాలయ అడ్మిన్, ప్లానింగ్, వీఆర్వో కార్యదర్శులతో నక్షా కార్యక్రమ ప్రారంభోత్సవ సభను నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నక్షా కార్యక్రమ లక్ష్యం, అమలు ప్రక్రియ, పనితీరు, ఫలితాలు వంటి వివరాలను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా, డ్రోన్ ఫ్లైయింగ్ ఏజెన్సీ ప్రతినిధులు అవగాహన కల్పించి, అనంతరం నక్షా పోస్టులను ఆవిష్కరించారు. సమావేశ భవనం పై నుండి ఎమ్మెల్యే, కమిషనర్ డ్రోన్ ఫ్లైయింగ్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక సమస్యలు, సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని, నక్షా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తైతే, వాటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ముఖ్యంగా కల్లూరు అర్బన్ ప్రాంతంలో చాలా మంది ప్రజలు తమకు వద్దకు ప్రతిరోజు వచ్చి, విలువైన భూములకు సంబంధించిన ఆక్రమణల గురించి ఫిర్యాదు చేస్తుంటారని, అందుకు పరిష్కారం కష్టతరంగా మారిందన్నారు. న్యాయస్థానాల్లో సైతం పెద్ద ఎత్తున ఈ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, ఈ సర్వే చిన్నపాటి సందుల్లో సైతం జరుగుతుందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కలిగించే నక్షా పైలెట్ ప్రాజెక్టుల్లో కర్నూలు నగరాన్ని ఎంపిక చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.

కమిషనర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా భూ రికార్డుల డిజిటలీకరణ కార్యక్రమం (డిఐఎల్‌ఆర్ఎంపి) లో భాగంగా నక్షా కార్యక్రమాన్ని రూపకల్పన చేసిందని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతో, భవిష్యత్తులో అటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నక్షా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ భూ సర్వే వలన పౌరులకు సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని, తద్వారా భూమి బదలాయింపు సమయంలో సందేహాలు, సమస్యలు లేకుండా జరుగుతాయన్నారు. ఇప్పటివరకు నక్షా లాంటి కార్యక్రమం లేనందున, వివిధ శాఖల్లో, న్యాయస్థానాల్లో కేసులు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. కొన్ని పనులకు పదేపదే వివిధ శాఖలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని, అప్పుడు సమస్య పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతుందన్నారు. డ్రోన్ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని, నక్ష మార్గదర్శకాల ప్రకారం భూముల ఛాయచిత్రాలు, సరిహద్దులు వంటి వివరాలను డిజిటల్ చేయడం జరుగుతుందని, ప్రక్రియలో అభ్యంతరాలు సైతం తీసుకుంటామని చెప్పారు. నక్షా ప్రారంభ దశలో పైలెట్ ప్రాజెక్టుల్లో కర్నూలు ఎంపిక కావడం నగర ప్రజలు హర్షించదగ్గ‌ విషయమని, వివాద రహిత శాశ్వతమైన ల్యాండ్ రికార్డు ఏర్పాటుకు నగర ప్రజలంతా సహకరించాలని కమిషనర్ కోరారు.

సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నక్షా కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా 152 పట్టణాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఎంపిక చేశారన్నారు. దేశంలో ప్రతి ఇల్లు, ఆస్తిని పక్కాగా సర్వే చేసి, అక్షాంశాలు, రేఖాంశాలతో ఆస్తుల హద్దులను గుర్తించి, వాటి విస్తీర్ణాలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేసి, ప్రభుత్వాల వద్ద పక్కా లెక్కలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా, నగరపాలక, భూమి కొలతలు-దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నక్షా నిర్వహిస్తాయన్నారు. ఏరియల్ సర్వేల ద్వారా ఖచ్చితమైన మ్యాపింగ్ చేసి, రాష్ట్ర ప్రభుత్వంతో, పౌరుల భాగస్వామ్యంతో భూ రికార్డుల ధృవీకరించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖల వద్ద జియోస్పేషియల్ డేటాతో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక ఉంటుందని, పౌరులకు డిజిటల్ ప్లాట్ఫారమ్‌ల‌లో సులువైన యాక్సెస్ తమ భూములను చూసుకోవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఖచ్చితమైన ఏకరూప వ్యవస్థ లేదని, భూ యాజమాన్య వివాదాలు, దీర్ఘకాలిక చట్టపరమైన కేసులను పరిష్కరించడానికి నక్షా ఎంతగానో ఉపయోగపడుతుందని, భూ ఆక్రమణలకు ఇక వీలు ఉండదన్నారు.

ఈ కార్యక్రమంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, మార్వెల్ జియోస్పేషియల్ (డ్రోన్) ఏజెన్సీ వైస్ చైర్మన్ కె.రవి కుమార్, ఆర్‌ఓ జునైద్, సూపరింటెండెంట్ సుబ్బన్న, పట్టణ ప్రణాళిక సిబ్బంది అనంత వెంకటేష్, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *