ప్రజల భద్రతే ప్రాధాన్యం..

మొంథా తుపాను బీభత్సంపై రాష్ట్ర‌ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు.

అయితే, తుఫాన్ సమయంలో సోషల్‌ మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని మంత్రి అనిత తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలు ఏదైనా వార్తను విశ్వసించే ముందు దాని నిజానిజాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ఆమె సూచించారు.

తప్పుడు సమాచారంపై హెచ్చరిక

కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు, ఇతర డిజిటల్‌ మీడియా సంస్థలు సంచలనాత్మక శీర్షికలు (Headings), భయపెట్టే థంబ్‌నెయిల్స్‌ ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అసత్య వార్తలు ప్రజల్లో అనవసర భయాన్ని, గందరగోళాన్ని సృష్టించడమే కాక, అధికార యంత్రాంగం చేపడుతున్న రక్షణ చర్యలపై అపోహలు పెంచుతాయని ఆమె అన్నారు.

తుఫాన్ సన్నద్ధత, ప్రభుత్వ చర్యలు…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర యంత్రాంగం గత మూడు రోజులుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు రక్షణ చర్యలను చేపట్టిందని మంత్రి అనిత వివరించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, వనరుల సమీకరణ, అలాగే విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో కలిసి తాను ఆర్టీజీ సెంటర్‌ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నానని హోం మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ విభాగాధిపతులు పరస్పర సహకారంతో పనిచేస్తున్నారని ఆమె చెప్పారు.

సహాయక చర్యల నిమిత్తం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించి, అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని తెలియజేశారు.

ఇక‌ ప్రభుత్వం మీడియా, సోషల్‌ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు తాజా, విశ్వసనీయ సమాచారాన్ని చేరవేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసం ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా నిరంతరంగా తాజా వివరాలను అందిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

Leave a Reply