ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..!

ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..!
నేటి నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు
రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు
ఖమ్మం ఉమ్మడి బ్యూరో,ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజల జీవనస్థితిగతులను మెరుగుపరిచే పీపుల్స్ బడ్జెట్ ను ప్రవేశపెట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఆర్థిక ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రణాళిక బద్దంగా బడ్జెట్ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పుట్టడం తమ అదృష్టం అన్న భరోసాను ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తుందన్నారు.
ఈ బడ్జెట్ సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదని, ప్రజల జీవనస్థితి గతులు మెరుగుపడేలా ప్రజల చుట్టూ తిరిగే అంకెలుగా ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింప చేస్తామని, రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా అందిస్తామని తెలిపారు. మన పిల్లలే రేపటి సంపద, వారి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా భావించి వారంలో ఆరు రోజులు పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు. యుక్త వయసులో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
వారం వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తామని , ఈ సంవత్సరం కూడా నియోజకవర్గానికి 1000 ఇందిరమ్మ ఇండ్లు చొప్పున మంజూరు చేస్తున్నాం అన్నారు. పని లేని వారికి పని కల్పించేందుకు ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఉద్యోగస్తుల కుటుంబాలకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులు. ప్రభుత్వ ఉద్యోగికి ప్రమాదం జరిగితే 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 68,89,955 పట్టాదారులకు 3446.94 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేశామని, రేపటినుండి 45 రోజుల్లో మూడు విడతల్లో రైతుల అందరి అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు.
ప్రపంచీకరణకు అనుగుణంగా మన బిడ్డలకు నైపుణ్యం నేర్పేందుకు స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను నెలకొల్పుతున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు రూ.2000 స్కాలర్షిప్ అందించబోతున్నా మన్నారు. విదేశాల్లో మన బిడ్డలకు ఉపాధి కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రవేశపెట్టామన్నారు.
ఈ సంవత్సరం కొత్తగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 14 వేల బెడ్స్ అందుబాటులోకి వస్తాయని భట్టి విక్రమార్క వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి హామ్ మోడల్ ద్వారా రూ .13,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిడిపిలో దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచేందుకు క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని తీసుకువచ్చాం అన్నారు.
గిరిజనుల భూములు సాగులోకి తీసుకువచ్చేందుకు 100% సబ్సిడీతో ఇందిరా సౌర గిరి జల వికాసం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 6.70 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురాబోతున్నాం అన్నారు.
సన్నధాన్యం సాగుచేసిన రైతులకు బోనస్ రూపంలో రెండు సీజన్లో ఒక్కో ఎకరాకు రూ. 25 వేలు జమ జమ అయ్యాయని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం రూ .14 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందనీ వివరించారు.
మన యూనివర్సిటీలను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ . 400 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6000 కోట్లు కేటాయించామన్నారు. చరిత్రలో మొదటిసారి గోదావరి పుష్కరాలకు రూ .440 కోట్లు కేటాయించాం. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి పనులు ప్రారంభించాం.
బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కప్పు ప్రవేశపెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ జావిద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మొక్క శేఖర్ గౌడ్, గజ్జెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
