కర్నూల్ బ్యూరో : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో అర్హులైన 2లక్షల 38వేల 302మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.103.30 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని సాయిబాబా సంజీవ నగర్ లో అరుణజ్యోతి, శంకరమ్మలకు వితంతు పెన్షన్లు, దేవర్ల నరసింహులు, భీమక్క, లలితా బాయి, రాగప్పలకు వృద్ధాప్య పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ అందజేశారు.
ఈ సందర్భంగా పెన్షన్ అందజేసే సమయంలో సర్వర్ లో ఏమైనా సమస్యలున్నాయా, టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ… పెన్షన్లు సరైన సమయానికి ఇస్తున్నారా, ఉదయం ఏ సమయానికి ఇస్తున్నారు, ఒకవేళ ఈనెల మీరు పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల రెండు పెన్షన్లు కలిపి తీసుకోవచ్చని కలెక్టర్ పెన్షన్ దారులకు అవగాహన కల్పించారు.
దేవర్ల నరసింహులకు వృద్ధాప్య పెన్షన్ ను అందజేస్తూ కలెక్టర్ వారి కుటుంబం, పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. అతని ఇల్లు సరిగా లేకపోవడంతో ఇంటిని నిర్మించుకునేందుకు అతని నుండి దరఖాస్తు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. ఎవరికైనా ఇల్లు లేకపోయినా, గుడిసెలో ఉన్నా, ఇల్లు సరిగా లేకపోయినా, అలాంటి వారికి ఇల్లు మంజూరు చేసేందుకు దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.