డయాలసిస్ పేషెంట్‌కు పింఛన్ అందజేత…

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పాలకోడేరు మండలం గరగపర్రు పంచాయతీ పరిధిలోని శేరేగూడెంకు చెందిన ఇర్లపాటి సోని డయాలసిస్ పేషెంట్‌. కిడ్నీ సమస్య తీవ్రమవటంతో కొద్దిరోజుల క్రితం ఆమెను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ కారణంగా ఆమె గత నెలలో కూడా డయాలసిస్‌ పెన్షన్‌ తీసుకోలేకపోయింది.

ఆసుపత్రి చికిత్స కోసం నగదు అవసరం కావడంతో సోని తండ్రి ఇర్లపాటి ఏసేబు తన కుమార్తె పరిస్థితిని వివరించి, పింఛన్‌ డబ్బులు అందించాలని గరగపర్రు గ్రామానికి చెందిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సానబోయిన మధు కిరణ్‌ను శనివారం కోరారు.

సోని పరిస్థితి తెలుసుకున్న మధు, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో తనకు కేటాయించిన పింఛన్లన్నీ పంపిణీ చేసి, వెంటనే రాత్రికి విశాఖపట్నం బయలుదేరారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం చేరుకున్న మధు, సోని చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి రెండు నెలలకు సంబంధించిన రూ.20 వేలు పింఛన్‌ డబ్బులను అందజేశారు.

ఆపదలో ఉన్న పేషెంట్‌కు సొంత ఖర్చులతో, శ్రమని లెక్కచేయకుండా వెళ్లి పింఛన్‌ అందజేసిన మధు కిరణ్‌ను గ్రామస్తులు, తోటి ఉద్యోగులు “శభాష్‌ మధు!” అంటూ అభినందిస్తున్నారు.

Leave a Reply