నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో ‘పేదల సేవలో పింఛన్ పంపిణీ’ కార్యక్రమంలో నేడు చంద్రబాబు పాల్గొన్నారు. నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలోని అంకోజి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజి కూతురు చలంచర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె ఐదేళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి, చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజి, సుమ కుమారుడుకి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.