పెద్దపల్లి ఆంధ్రప్రభ -ప్రేమ వ్యవహారం దారుణ హత్యకు కారణమైంది. పెద్దపెల్లి జిల్లాలో పరువు హత్య చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యారు. తన కూతురిని ప్రేమిస్తున్నాడని సాయి కుమార్ ను యువతి తండ్రి సదయ్య గొడ్డలితో దారుణంగా హతమార్చాడు. ముప్పిరితోటకు చెందిన పూరెల్ల పరశురాములు జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయికుమార్ చదువు మానేసి గ్రామంలో ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతీతో ప్రేమలో పడ్డాడు.
ఈ విషయం తెలిసిన సదరు యువతీ తండ్రి సాయికుమార్ ను హతమార్చేందుకు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ శివారులో మిత్రులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి చేరుకున్న యువతి తండ్రి సదయ్య గొడ్డలితో దారుణంగా దాడి చేశాడు. దీంతో యువకుడు సాయికుమార్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసిపి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. మృతుడు సాయికుమార్ పుట్టినరోజే హత్యకు గురి కావడం గ్రామంలో కలకలం రేపింది.