ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. టోర్నమెంట్ ప్రారంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్న పంజాబ్‌కు షాకిచ్చింది రాజస్థాన్. సొంత మైదానంలో 206 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన పంజాబ్ ను రాజస్థాన్ 155 కే కట్టడి చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్ పై భారీ విజయం నమోదు చేసింది.
ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉండే రాజస్థాన్ 7వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు చెన్నైపై ఢిల్లీ విజయంతో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయిన పంజాబ్.. రాజస్థాన్ చేతిలో ఓటమితో 4వ స్థానానికి పడిపోయింది.
వధేరా ఒంటరి పోరాటం..
కాగా, ఈ ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. కేవలం నేహాల్ వధేరా (62), గ్లెన్ మాక్స్ వెల్ (30) మినహా మరే ఆటగాడు 20కి పైగా పరుగులు సాధించలేదు. కీలక బ్యాటర్లు కూడా ప్రభావంతమైన ఇన్నింగ్స్ ఆడకపోండంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు.
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ, మహేష్ తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, వానిండు హసరంగా తలా ఒక వికెట్ తీశారు.
దంచేసిన బ్యాటర్లు..
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చెలరేగింది. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన యువ స్టార్ యశస్వి జైస్వాల్ (67), కెప్టెన్ సంజు శాంసన్ (38) తొలి వికెట్ కు 60 బంతుల్లో 89 పరుగులు జోడించారు.
ఇక రియన్ పరాగ్ (25 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులతో 43 నాటౌట్) దంచికొట్టాగా.. నితిష్ రాణా (7 బంతుల్లో 2ఫోర్లు 12), హిట్మేయర్ (12 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సుతో 20), ధ్రువ్ జురేల్ (5 బంతుల్లో 1ఫోర్, 1సిక్సుతో 13 నాటౌట్) రాణించారు. దీంతో రాజస్థాన్ స్కోర్ 200 దాటింది.
ఇక పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో పంజాబ్ జట్టు 206 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగనుంది.

