pawan kalyan| ‘జనసేన’లో ఆందోళన

pawan kalyan| ‘జనసేన’లో ఆందోళన

  • పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు తీసుకోని అధినాయ‌క‌త్వం
  • పార్టీపై నానాటికీ సన్నగిల్లుతున్న ఆదరాభిమానాలు
  • జిల్లా స్థాయిలో నడిపించే నాయకుడు క‌రువు
  • కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా ద‌క్కిన గౌరవం
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో సముచిత స్థానం దక్కడం లేదని జనసైనికుల ఆవేద‌న‌
  • స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే జ‌న‌సేన ప‌రిస్థితి ఏమిట‌ని ప్ర‌శ్న‌లు

(విజయనగరం-ఆంధ్రప్రభ బ్యూరో) : అధినాయకత్వం అచేతనత్వంపై జనసైనికుల్లో నిస్తేజం అలముకుంది. అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమానులు సైతం పార్టీ మనుగడపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి దశాబ్ద కాలం దాటి పోయినా ఇప్పటికీ సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు అధినాయకత్వం చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా ఆ దిశగా ఆలోచించక పోవడం పట్ల మండిపడుతున్నారు. జిల్లా స్థాయిలో నడిపించే నాయకుడు లేకపోవడం పార్టీ బలోపేతమన్నది కలగా జనసేన పార్టీ మిగిలిపోతోందని జనసేన వీరాభిమానులంతా వాపోతున్నారు. అధికారంలో లేనపుడు జెండాను నిలువెల్లా అభిమానంతో మోసేవారిమని, కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ చొరవ చూపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు.

పార్టీకి ద‌క్క‌ని గౌర‌వం?
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నామన్న మాటేగానీ తమ పార్టీకి తగిన గౌరవం దక్కడం లేదన్నది జనసేనలో అధిక సంఖ్యాకుల వాదన. ప్రభుత్వంలో తమ పాత్ర ఎంతో తమకు తెలియదు గానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి ప్రభుత్వ కార్యాక్రమాల్లో తమకు సముచిత స్థానం దక్కడం లేదని జనసైనికులు వాపోతుండడం పరిపాటిగా మారింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ఎంతో హడావిడి చేసిన జనసేన నాయకులు(అందరూ కార్యకర్తలే అనుకోండి) గత కొంతకాలంగా స్తబ్ధుగా కనిపిస్తున్న పరిస్థితి. ఏదైనా కార్యక్రమాలు చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప నాయకులనుకున్న వారెవరూ ఆమేరకు సన్నద్ధంగా లేని పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలున్నప్పటికీ ఆయా కార్యక్రమాలకు జనాలను పోగెయ్యడానికి నాయకులు పడరాని పాట్లు పడుతున్న నేపథ్యాన్ని వారే స్వయంగా అంగీకరిస్తున్నారు.

పార్టీకి జిల్లా అధ్య‌క్షుడు ఎక్క‌డ‌?
వాస్తవానికి పార్టీకి జిల్లా అధ్యక్షుడు వుంటే ఆపైన నియోజకవర్గ, మండల స్థాయిల్లో కార్యవర్గాలు ఏర్పడి పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నది సీనియర్ల ఉవాచ. అంతే కాకుండా ఏవైనా కార్యక్రమాలు చేపట్టేందుకు నలుగురిని పోగెయ్యడానికి అవసరమయ్యే సొమ్మును అధ్యక్ష స్థానంలో వున్నవారు అనివార్యంగా వెచ్చిస్తారని, తద్వారా పార్టీపై క్యాడర్లో విశ్వాసం కలుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ‘జనసేన’ భాగస్వామ్యం ఎంత? తలలు పట్టుకోవడం మినహా ఎవరూ ఏమి చెప్పలేరని బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద ఈ విధంగా ఎంత కాలం నిస్తేజంగా పడివుండాలన్న ఆవేధన ఆ పార్టీ సీనియర్లలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరి అధినాయకత్వం ఆలోచన ఏంటో తేలాలంటే జనసైనికులు మరింత కాలం నిరీక్షించాల్సిందేనని చెప్పకతప్పదు.

Leave a Reply