ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు డాక్టర్లు నాణ్యమైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (choutuppal) పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఇవాళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ (Shamim Akhtar) సందర్శించారు. హాస్పిటల్ లోని మెడికల్, క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, ఏక్స్ రే తదితర వార్డులను, ఆస్పత్రి పరిసరాలను, రికార్డులను పరిశీలించారు.
చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్లు తదితరులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో (hospital) రోగులకు కావలసిన అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ పట్ల రోగుల్లో మంచి నమ్మకం కలిగించే విధంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు.
వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ షమీం అక్తర్
చౌటుప్పల్ పట్టణంలోని బంగారిగడ్డలో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవన సముదాయం నిర్మాణం పనులను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ హస్పటల్ స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం పనులను నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఆస్పత్రి భవన సముదాయం నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని, త్వరగా పనులు పూర్తి చేసి అప్పగించడం జరుగుతుందని కమిషన్ చైర్మన్ కు కాంట్రాక్టర్ (contractor) వివరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి మనోహర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ లక్ష్మీపురం యశోద, హాస్పిటల్ సూపరిండెంట్ చిన్నా నాయక్, డాక్టర్ అలివేలు, డాక్టర్ చింతకింది కాటమరాజు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.