ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లాలో గత నెల రోజులుగా ఎరువుల(Fertilizers) కొరతతో రైతులు రైతు సేవా కేంద్రాల చుట్టూ, మార్క్ ఫెడ్ కేంద్రాల చుట్టూ, సొసైటీల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారు. ఇంతలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసులపాడు గ్రామంలో ఓ లారీలోడు యూరియా మాయం పై ఆంధ్రప్రభ(Andhraprabha)లో ప్రత్యేక వార్త కథనం ప్రచురితమైంది. అంతే రెవెన్యూ అగ్రికల్చర్ అధికారుల్లో చలనం రగిలింది. ఈ ఘటనపై విచారణ జరిపారు. లారీ మాయం సంగతిని గుర్తించారు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ బాధ్యుడని అధికారులు తేల్చారు. ఇందుకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. శనివారం గోస్పాడు ఎస్ఐ పి.సుధాకర్ రెడ్డి, తాహసిల్దార్ షేక్ మొహమ్మద్దీన్, వ్యవసాయ అధికారి స్వప్నిక ఆధ్వర్యంలో పాసు బుక్కును చూపించి న రైతులకు ఎకరాకు మూడు బస్తా యూరియాను పంపిణీ చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
మిస్సింగ్ కు అడ్డుకట్ట
ఈనెల 4 న 2600 టన్నులు, ఐదో తేదీన మరో 2600 టన్నులు, ఈనెల 10వ తేదీన మరో 2600 టన్నులు, 13 న 1300 టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజకుమారి, వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో జిల్లాకు వచ్చే 5200 టన్నుల యూరియా(Urea)లో 3500 టన్నులు జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు, 1700 టన్నుల యూరియాను ప్రైవేట్ డీలర్లకు అందుబాటులో ఉండేటట్టుగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియాను రైతులకు పంపిణీ(Distribution) పటిష్టంగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. యూరియాను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించకుండా జిల్లా సరిహద్దులు దాటి పోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీలను నియమించారు.
కంట్రోల్ రూమ్ సిద్ధం
యూరియా సరఫరాల పంపిణీ పై రైతులకు ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే నంద్యాల జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్ 08514-293903 కి సమాచారం(Information) అందించవచ్చన్నారు. జిల్లాలో ఎరువులు అక్రమ రవాణా మార్గంలో సరఫరా అవుతున్న ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలపవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. యూరియా అందుబాటుపై రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలుపుతున్నారు.
డీ ఏ పీ కొరత లేదు
జిల్లాలో డీఏపీ ఎరువుకు కొరత లేదని ఆళ్లగడ్డ(Allagadda) వ్యవసాయ సంచాలకులు సి.విజయ్ శేఖర్ తెలిపారు. కొన్ని గ్రామాలలో అక్రమంగా తరలిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం లేకపోవడం విశేషం. ఆంధ్రప్రభ బ్యూరోకు ఆళ్లగడ్డ వ్యవసాయ సంచాలకులు సి.విజయ్ శేఖర్ ఇచ్చిన వివరణ మేరకు రైతు సేవ కేంద్రాలలో విలేజ్ అగ్రికల్చర్(Agriculture) అసిస్టెంట్ గాని విలేజ్ ఆర్టికల్స్ అసిస్టెంట్ కానీ ఇండెంట్ పెడితే రైతులు ఇచ్చిన వేలిముద్రలపై దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వానికి సొమ్ము చెల్లిస్తే డీఏపీ ఎరువులను సరఫరా చేస్తామని తెలిపారు.