న్యూ ఢిల్లీ – పహల్గాం ఉగ్రదాడి, ఓటర్ల జాబితా సవరణ అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభమైన వరుసగా మూడోరోజైన బుధవారం కూడా ఉభయసభలు అట్టుడికాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఎగువ సభ, దిగువ సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలవగానే.. బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు. ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని వారు విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణతోపాటు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు డిమాండ్ చేశారు. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది.
ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలతో సభా కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. సభ్యులు ఎంతకూ తగ్గకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ రేపటి వాయిదా పడ్డాయి. రేపు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయి