paritala | పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు..

paritala | పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు..
పరిటాల రవి హయాంలో మూడు రకాల కొబ్బరి తోటలు సాగు
అప్పట్లోనే కొబ్బరి సాగుకు అవార్డులు సాధించిన పరిటాల రవి
మరోసారి భారీ దిగుబడులపై పరిటాల సునీత సంతోషం
paritala | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురంలో ఉన్న పరిటాల కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన కొబ్బరి తోటలు ఈసారి భారీ దిగుబడులు ఇవ్వడంతో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆనందం వ్యక్తం చేశారు. తన నివాసంలో తాజాగా కోయించిన కొబ్బరికాయలను చూపిస్తూ రైతుల తరహాలోనే తన సంతోషాన్ని పంచుకున్నారు.
పరిటాల రవి హయాంలోనే తమ వ్యవసాయ క్షేత్రంలో మూడు రకాల కొబ్బరి సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతులతో సాగు చేయడం, నీటి నిర్వహణ, సరైన ఎరువుల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల అప్పట్లోనే మంచి దిగుబడులు వచ్చాయని చెప్పారు. అదే సమయంలో కొబ్బరి సాగులో వినూత్న ప్రయోగాలు చేయడంతో రాష్ట్రస్థాయి అవార్డులు కూడా లభించాయని గుర్తుచేశారు.
ఇప్పుడూ అదే పద్ధతులను కొనసాగిస్తూ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా మరోసారి కొబ్బరి తోటల నుంచి అధిక దిగుబడి సాధించగలిగామని తెలిపారు. పంటల నాణ్యత కూడా మెరుగ్గా ఉండటం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం పట్ల తమ కుటుంబానికి మొదటి నుంచే ప్రత్యేకమైన ఆసక్తి ఉందని, రైతుల అభివృద్ధి కోసం కొత్త పద్ధతులను అనుసరించడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టి, శాస్త్రీయ సాగు విధానాలను పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చని పరిటాల సునీత సూచించారు. అధిక దిగుబడులు సాధించిన ఈ కొబ్బరి తోటలు స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు
