రోడ్ షో లో మాట్లాడుతున్న కేటీఆర్

రోడ్ షో లో మాట్లాడుతున్న కేటీఆర్

కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్
రేవంత్ రెడ్డిని నమ్మి ప్రజలు నష్టపోయారు
ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 6 గ్యారంటీలా బాండ్ పేపర్ అడ్రస్ లేదు
పరకాలను అభివృద్ధి చేసింది చల్లా ధర్మారెడ్డి
మార్పు కోరి ఆగమయ్యారా
బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న కేటీఆర్

పరకాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని, ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు నెరవేర్చకుండా ప్రజలు నష్టపోయేలా రేవంత్ రెడ్డి చేశారని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీ ల బాండ్ పేపరు రాసిచ్చి వాటిని అమలు చేయలేక విఫలమయ్యారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకుల చొక్కా పట్టుకొని అడగాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో బస్టాండు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెల్లారి లేస్తే కేసీఆర్ ను తిట్టడమే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కొరవడిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల హామీ నెరవేర్చలేకపోయిందని, రేవంత్ రెడ్డిని నమ్మిన ప్రజలను నట్టేట ముంచారని అన్నారు.

అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిన చందంగా మార్పు మార్పు అన్న ప్రజలారా ఈరోజు ఆగమయ్యారా అని కేటీఆర్ ప్రజలను అడిగారు. ఏ హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలని రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆడబిడ్డలు నిలదీయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెల్లని 2000 నోట్లు ఇస్తారు జాగ్రత్త అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని బిఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు. పరకాలను ఏం అభివృద్ధి చేశావని రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజలను ఓట్లు అడగడానికి వెళుతున్నావు అని, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కెసిఆర్ ఆశీస్సులతో నిధులు తీసుకువచ్చి పరకాలలోని ప్రభుత్వ పలు నూతన భవనాల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం చేశారని కేటీఆర్ అన్నారు. పరకాల మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గండ్ర రమణారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply