పంచసూత్రాలు పాటిస్తేనే రైతులకు ప్రయోజనం

పంచసూత్రాలు పాటిస్తేనే రైతులకు ప్రయోజనం
గుంటూరు, ఆంధ్రప్రభ : రైతులు పంచ సూత్రాలను ఆకళింపు చేసుకుని, క్షేత్ర స్థాయిలో అమలు పరిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహనరావు అన్నారు. బుధవారం పెదనందిపాడు మండలంలోని అబ్బినేనిగుంటపాలెం, వరగాని, అన్నపర్రు గ్రామాల్లో రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహనరావు, మండల వ్యవసాయ అధికారి ఐ. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏ డీ ఏ మోహనరావు మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం ఐదు ప్రధాన అంశాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ సాంకేతికతలను రైతుల ముంగిటకు చేర్చడం, సమగ్ర డిజిటల్ వ్యవస్థపై అవగాహన కల్పించడం, పంటలకు గిట్టుబాటు ధర కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించడం వంటి అంశాలను వివరించారు. ప్రస్తుత విడత కార్యక్రమం ముగిసిందని, తదుపరి విడతను ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతు సేవా కేంద్రాల వీఎఎలు, విహెచ్ఎల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో రోజుకు 30 క్లస్టర్లకు చెందిన సుమారు 90 మంది ైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందచేస్తున్నట్లు తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పంటల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలు సులభంగా పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రోగ్రెసివ్ రైతులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
