Pamarru | ప్రయాణికులకు పాట్లు..

Pamarru | ప్రయాణికులకు పాట్లు..
కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గం మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో విద్యార్థులు, ప్రయాణీకులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆర్టీసీ డ్రైవర్ ను (Rtc Driver) ఇరువురు యువకులు కోసూరు గ్రామంలో బస్సు ఆపలేదన్న కారణంగా దాడి చేశారు. దీంతో మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సు సర్వీసులను డ్రైవర్లు నిరవధికంగా నిలిపివేయటంతో ప్రయాణీకలతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్ ఉప్పల రాఘవరావు కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూచిపూడి ఎస్ఐ శిరీష ఇరువురు యువకుల పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ ఈ నెల 21వ తేదీ నుంచి మచిలీపట్నం డిపోకు చెందిన మొవ్వ వరకు తిరిగే సర్వీసులు నిలుపు వేయడంతో ప్రయాణీకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Pamarru | 15 గ్రామాల ప్రజలు అష్టకష్టాలు..
మొవ్వ గ్రామంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, జెడ్పీ హైస్కూళ్లు ఉండటంతో విద్యార్థులు (Students) పలు గ్రామాల నుంచి వస్తుంటారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతీ రోజు మచిలీపట్నం నుంచి మొవ్వ వరకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. ఇరువురు యువకుల దురుసు ప్రవర్తనతో డ్రైవర్లు ఈ రూటులో బస్సు నడపలేమని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు సైతం ఏమీ చేయాలో పాలుపోక సర్వీసును నిలిపుదల చేశారు. మొవ్వ మండలంలోని మొవ్వ, కోసూరు, వేములమడ, కాజ, పద్దారాయుడుతోట, మట్లమాలపల్లితో పాటు గూడూరు మండలంలోని రామరాజుపాలెం తదితర 15 గ్రామాల ప్రజలు 10 రోజుల నుంచి పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసు పథకం ప్రవేశపెట్టడంతో దానిని వారు వినియోగించుకుంటున్నారు. ఉదయం వేళ ఎలాగోలా పాఠశాలలు, కళాశాలలకు వస్తున్న విద్యార్థినులు సాయంత్రం మొవ్వ – మచిలీపట్నం రూట్లోని గ్రామాలకు వెళ్లేందుకు ఆటోలు, ఇతర వాహనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Pamarru | 10 రోజులుగా..
ఇద్దరు చేసిన తప్పిదానికి 15 గ్రామాల ప్రజలు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపలేదన్న కోపంతో దాడి చేయటం సబబు కాదని పలువురు కోసూరు వాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం మొవ్వ మండలానికి వచ్చే నిర్మాణ రంగ కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వందలాంది ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీసును త్వరగా పునరుద్ధరించాలని అధికారులను వేడుకుంటున్నారు. మహిళలు (Womens) కూలీ పనుల నిమిత్తం మండల కేంద్రమైన మొవ్వకు వచ్చి తమ గ్రామాలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించటంతో వారు అధికంగా వసూళ్లు చేస్తున్నారని వాపోతున్నారు. మొవ్వ, గూడూరు రెండు మండలాలకు చెందిన 15 గ్రామాల ప్రజలు 10 రోజులుగా ఇంత ఇబ్బందులు పడుతున్నా స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు స్పందించకపోవటంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థులు, మహిళలు, ఇతరుల ఇబ్బందులు గమనించి ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీస్ నడిపేలా చర్యలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు.

