ఉగ్రదాడి ఘటనపై విచారణ కోసం సుప్రీంలో పిటిషన్
తీవ్రవ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం
ఇది సున్నితమైన సమయం.. బాధ్యతగా వ్యవహరించండి
న్యాయమూర్తులు దర్యాప్తు అధికారులు కాదంటూ చురకలు
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై రిటైర్డ్ జడ్జీతో న్యాయ విచారణ చేపట్టాలని దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్య కాంత్, ఎన్కే సింగ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. ఫతేష్ సాహూ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో సైనిక బలగాలను నిర్వీర్యం చేయరాదు అని కోర్టు అభిప్రాయపడింది. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్క భారతీయుడు చేయి చేయి కలిపిన కీలకమైన సమయమిదని, ఇలాంటి సందర్భంలో సైనిక దళాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయరాదు అని, ఆ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలని ధర్మాసనం పేర్కొన్నది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఇలాంటి సున్నితమైన విషయాల్లో పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
సమస్యలను పరిష్కరించడమే జడ్జీల టాస్క్ అని, దర్యాప్తులు చేపట్టడం తమ పని కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. బాధ్యతాయుతమైన వ్యక్తిగా వ్యవహరించాలని, భద్రతా దళాలను ఇలాగే నిర్వీర్యం చేస్తారా అని, ఎప్పటి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు దర్యాప్తుల్లో నిపుణులు అయ్యారని కోర్టు ప్రశ్నించింది. తాము కేవలం వివాదాలను పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది.
సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాలని దాఖలు చేసిన పిటీషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు పిటీషనర్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హైకోర్టును ఆశ్రయించేందుకు ఆ పిటీషనర్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.