రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి

రాష్ట్రంలోని పద్మశాలీలు, చేనేతలు ఏకం కావాలి
- చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీర మోహన్
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ వరంగల్ లోని కొత్తవాడలో పర్యటించారు. ఆదివారం కొత్తవాడలోని చేనేత సహకార సంఘాలను సందర్శించి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ కొత్తవాడ చేనేత సహకార సంఘంను సందర్శించడానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు సంఘం అధ్యక్షులు మధనయ్య స్వాగతం పలికారు.
అనంతరం సంఘంలోని చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించి కార్మికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘంలో నిల్వ ఉన్న వస్త్రాలను వివరాలు అలాగే రోజు వారి కూలి వేతనాలపై కూడా ఆరా తీశారు. ఈ సందర్బంగా రాపోలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వ్యవస్థపై అవలంబిస్తున్న తీరును ఖండిస్తూ, ప్రభుత్వం తీసుకొని వచ్చిన టెండరింగ్ విధానంపై ధ్వజమెత్తారు.
రైతు, నేత అనేవి రెండు కళ్ళు లాంటివి అని అలాంటి నేపధ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తవాడ చేనేత కార్మికుల పై టెండరింగ్ విధానం తీసుకువచ్చి వారి కడుపు కొడుతుందని మండిపడ్డారు. చేనేతలకు గండంగా మారిన టెండర్ విధానం అమలు చేస్తే జరిగే నష్టాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి టెండర్ విధానమును రద్దు చేసి పాత పద్దతిలోనే కొత్తవాడ చేనేత నిల్వలను కొనుగోలు చేసి చేనేతకు అండగా ఉండాలని అన్నారు.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులను సంఘటితం చేసి పోరాటానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర మీడియా కార్యదర్శి లింగమూర్తి మాట్లాడుతూ.. చేనేతకు సరైన మార్కెట్, స్థిరమైన ఆర్డర్లు లేకపోవడం, ముడిసరుకు ధరలు పెరగడం, బకాయిల చెల్లింపులు ఆలస్యం వంటి సమస్యలతో నేతన్నలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ సమావేశం లో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు చెరుకు మల్లయ్య, వేముల ఉమా రాణి, గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేత, దాసరి సుధాకర్, మంత్రి కమలాకర్, చెన్నూరు విజయ లక్ష్మి, ఆడేపు నాగేష్, తురాయి రజిని, చేనేత సహకార సంఘం కార్యకర్తలు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
