ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత

హైదరాబాద్, ఆంధ్రప్రభ : మోంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిరంతర వర్షాల కారణంగా, అధికారులు హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేశారు.
ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి దాదాపు 2,300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయాల నుంచి విడుదలైన నీటి ప్రవాహం పెరగడంతో నర్సింగా–మంచిరేవుల కల్వర్ట్ పై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
కాచ్మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వలన పెద్దఎత్తున నీరు జలాశయాల్లోకి చేరుతుండటంతో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులు అప్రమత్తంగా ఉండి మిగులు నీటిని మూసీ నదిలోకి విడుతల చేస్తున్నారు. ప్రజలు మూసీ నది తీర ప్రాంతాలకు వెళ్లరాదు. అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలి. నీటి ప్రవాహం ఉన్న రహదారులపైకి వెళ్లరాదు.
ఇక హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ (ORR) సర్వీస్ రోడ్లో, ఎగ్జిట్/ఎంట్రీ 17 సమీపంలో రహదారి తీవ్రంగా దెబ్బతింది. సగర్ గేట్లు తెరవడంతో నీటి ప్రవాహం పెరగడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని హెచ్చరిక జారీ చేశారు. రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభించేందుకు సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాయి.

