కర్నూలు : ఓర్వకల్లు- విజయవాడ (Orvakallu- Vijayawada) మధ్య విమాన సర్వీసులు (Air services) ప్రారంభమయ్యాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. వారానికి మూడు రోజుల పాటు కర్నూలు- విజయవాడ మధ్య సర్వీసులను ఇండిగో సంస్థ నడపనుంది. త్వరలో ప్రతిరోజూ ఉండేలా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు నుంచి మిగిలిన ప్రాంతాలకు కూడా సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు. విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా కర్నూలులో మంత్రి టీజీ భరత్ తదితరులు ప్రయాణికులకు స్వాగతం పలికారు.
వారంలో మూడు రోజులు అనగా సోమ, బుధ, శుక్ర వారాల్లో రాకపోకలు సాగనున్నాయి. విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి సరిగ్గా 3.45 నిమిషాలకు విమానం బయల్దేరింది. ఓర్వకల్లు విమానాశ్రయానికి 4.55 గంటలకు చేరుకోనుంది. అలాగే ఓర్వకల్లు నుంచి 5.30 గంటలకు బయల్దేరి విజయవాడకు 6.15 నిమిషాలకు విమానం చేరుకోనుంది. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.2,506గా నిర్ణయించారు.
కాగా కర్నూలు(Kurnool)కు విమానాశ్రయం కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. 2013లో ఓర్వకల్లు విమానశ్రయానికి అప్పటి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అయింది. 2016 స్థలం కేటాయించేందుకు ఆమోదం లభించింది. 2017 ఫిబ్రవరి భూకేటాయింపులు జరిగాయి. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) 2017 జూన్‌లో విమానాశ్రయం ఏర్పాట్లుకు శంకుస్థాపన చేశారు. 2019 జనవరిలో విమానాశ్రయాన్ని ప్రారంభించారు.2021, మార్చి 28న ఓర్వకల్లు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలు విమాన సేవలు ప్రారంభించారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఓర్వకల్లు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు అడుగులు వేసింది. తాజాగా విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.