హైదరాబాద్ – కేంద్రం పూర్తిగా తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నదని ఆక్షేపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. తెలంగాణ చేసిన ప్రతి విజ్ఞప్తిని చెత్త బుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ మేరకు రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తొమ్మిది పేజీల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ఆయన నేడు మీడియాకు విడుదల చేశారు.. ఆ లేఖలో కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతని సీఎం అన్నారు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్ రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని మూసీపై మాత్రం ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
‘రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతా రాహిత్యం. తెలంగాణలో 2023, డిసెంబరు 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా మా పాలన సాగుతోంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రోఫేజ్-II, ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్ కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్రప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నాం. ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరు చేయించాలని కోరాము. ఇదే విషయాన్ని నేను ప్రస్తా విస్తే ముఖ్యమంత్రి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, మమ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులను కలవడం, ఆయా శాఖలు అడిగిన వివరాలు అందజేయడం ప్రధానమంత్రిని కలిసి అందజేయడంతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా మాపై విమర్శలు చేయడం తీవ్ర అభ్యంతరకరం. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఉన్న మీరు తెలంగాణ ప్రజలకు చేసిందేమిటో తెలియజేయండి. కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటీ సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇకైనా మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రూ. 1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను’ అని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ముఖ్యాంశాలు:
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఆలస్యం . తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోకపోవడం.
బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తూ, హైదరాబాద్ మెట్రో విస్తరణను నిర్లక్ష్యం చేయడం.
2.అవసరమైన కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తోంది
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (రూ.24,269 కోట్లు)
రిజినల్ రింగ్ రోడ్ ఉత్తర, దక్షిణ భాగాలు (రూ.34,367.62 కోట్లు)
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ (రూ.10,000 కోట్లు)
హైదరాబాద్ డ్రై పోర్ట్ నుంచి ఏపీ సీ పోర్ట్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (రూ.17,000 కోట్లు)
3.రాజకీయ దుశ్చర్యలపై విమర్శలు
తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని కిషన్ రెడ్డి, ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై సీఎం ఆగ్రహం. కేంద్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు.
4.మూసీ నది పునరుద్ధరణకు కేంద్రం మద్దతు కావాలి
గోదావరి నీటిని మూసీ నదికి అనుసంధానం చేయాలన్న ప్రణాళిక. నదిని శుద్ధి చేయడానికి చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అవసరం.
5.తెలంగాణపై కేంద్రం వివక్ష
గుజరాత్‌లోని సబర్మతి నది, గంగానది పునరుద్ధరణకు కేంద్రం నిధులు కేటాయించగా, మూసీ పునరుద్ధరణపై మౌనం పాటించడం. తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు.
6.ప్రభుత్వ ప్రాజెక్టులకు రాష్ట్రం సిధ్ధం – కేంద్రం ఎందుకు ఆలస్యం?
రాష్ట్రం వాటా వ్యయం భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం. రూ. 1,63,559.31 కోట్ల ప్రాజెక్టులకు మంజూరు కావాలని విజ్ఞప్తి.
7.తెలంగాణకు చేసిన మేలు చెప్పాలని కిషన్ రెడ్డిని సవాలు
కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి, రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్.
కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏమీ సాధించలేకపోయారని ఆరోపణ.
8.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ
అన్ని కీలక ప్రాజెక్టుల అమలుకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి.
తక్షణమే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్