వన్ విజన్ – వన్ డైరెక్షన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో డేటా ఆధారిత పాలన పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. నారా లోకేష్ తో సహా పలువురు మంత్రులు, అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, హెచ్ఓడీలు, వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి..? సత్వర నిర్ణయాలు ఏవిధంగా తీసుకోవచ్చు అనే దాని పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వన్ విజన్ – వన్ డైరెక్షన్.. ఇదే ప్రభుత్వం విధానం అని చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలన్నారు. దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని కోరుతున్నాను. నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌర సేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు.
ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశారని.. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని చంద్రబాబు చెప్పారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

