పొగాకు ఉత్ప‌త్తుల‌కు దూరంగా ఉండాలి..

పొగాకు ఉత్ప‌త్తుల‌కు దూరంగా ఉండాలి..

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వలన ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుందని, జీవితం ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని అధిగమించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రవి కుమార్(Ravi Kumar) విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ రోజు బిజినేపల్లి(Bijinepally) మండలం పాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాగర్ కర్నూల్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్(National Tobacco Free Youth Campaign), ప్రపంచ మానసిక వారోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ రవి కుమార్ మాట్లాడుతూ.. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, తంబాకు, మావ, జర్దా వంటి ఉత్పత్తులు వినియోగించడం వల్ల ఊపిరితిత్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. సీఓపిడి(COPD), బ్రాంకైటీస్, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె పోటు, పక్షవాతం, అంధత్వం, మధుమేహం, అధిక రక్తపోటు, ముఖ్యంగా పురుషులలో పునరుత్పత్తి, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయని తెలిపారు.

ఈ నెల 9 నుంచి డిసెంబర్ 8 వరకు 60 రోజుల పాటు అవగాహన వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. అక్టోబర్ 4 నుంచి 10 వరకు ప్రపంచ మానసిక(Mental Health) వారోత్సవాల నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా మానసిక ఒత్తిడి అధిగమించడానికి ప్రతిరోజు ధ్యానం, యోగ చేయాలని డిఎంహెచ్ఓ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సైక్రియాటిస్ట్ హెచ్ఓడి డాక్టర్ ఫణికాంత్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమిలు ఉంటాయని, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి విద్యార్థులు పాఠ్య‌ అంశాలు ప్రణాళిక ప్రకారం చదవాలని తెలియజేశారు. జీజీహెచ్ సైక్రియాటిస్ట్(GGH Psychiatrist) డాక్టర్ అంబుజ మాట్లాడుతూ.. విద్యార్థులు ఏదైనా మానసిక సమస్య వచ్చినప్పుడు వెంటనే టెలి మానస్ 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని, 24 గంటలు నిపుణులైన కౌన్సిలర్లు సైక్రియాటిస్టులు అందుబాటులో ఉంటారన్నారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ స్వామి, సీనియర్ లెక్చరర్ మధుసూదన్ రెడ్డి(Madhusudhan Reddy), పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి, ఏపీవో విజయ్ కుమార్, బాదం రాజేష్, మల్లేష్ హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్ఎం గజవర్ధనమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply