AP | కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మరో అడుగు..
- కార్యానిర్వాహాక పక్రియను ప్రారంభించిన ప్రభుత్వం
- బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలనకు హైకోర్టు రిజిష్టర్ ఆదేశం
- స్థలం, వసతులపై అధ్యాయనంకు అధికారులకు కలెక్టర్ ఆదేశం
- ఇప్పటికే ఏపిఈఆర్‌సి, రెండవ బెటాలియన్ భవనాల పరిశీలన
- ఏడాదిన్నర్రలోగా శాశ్విత భవనం
కర్నూల్ బ్యూరో : హైకోర్టు విభజనపై ప్రభుత్వం మరో ముందడుగు పడింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం..కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, వసతుల అధ్యయనం చేయాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఇందుకోసం కర్నూలు రోడ్ల భవనాల శాఖ ఎస్‌ఇతో పాటు నగరపాలక సంస్థ కమీషనర్‌కు, కర్నూలు ఆర్‌డిఓకు కర్నూల్లో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు నిర్దిష్ట సమాచారం కోసం విచారణ నిర్వహించి నివేదికను సమర్పించేందుకు ఆదేశించడమైంది.
ఇందులో భాగంగా ఆర్‌సి నెంబర్ ఏ3, 66, 2025 ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు హైకోర్టు శాశ్విత బెంచ్ ఏర్పాటుకు నిర్ధిష్ట సమాచారం సేకరించి విచారణ నిర్వహించి అనంతరం నివేదిక పంపాలని రిఫరెన్స్ ఆర్‌ఓసి నంబర్ 503 / ఎస్‌ఓ, 2024, రిజిస్ట్రార్ (విజిలెెన్స్) సూచించడం జరిగింది. దీంతో రిజిష్టర్ సూచన మేరకు 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల మౌలిక సదుపాయాల లభ్యత, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, నివాస గృహాలకు సంబంధించి సమాచారాన్ని అందించాలని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే హైకోర్టుకు కావాల్సిన స్థలం కోసం వసతుల అధ్యయనం కూడ చేశారు. అన్ని వసతులు ఉండే స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏపి ఈఆర్‌సి, 2వ బెటాలియన్ భవనాలను అధికారులు పరిశీ లన చేశారు. అనంతరం వీటిపై జిల్లా కలెక్టర్‌కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.
హైకోర్టు డిమాండ్ ఈనాటిది కాదు :
శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. స్వాతంత్య్రానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా స్వప్నంగానే మిగిలిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన విధంగా కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయడానికి ఇటీవల ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ దీన్ని ప్రవేశపెట్టారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కర్నూలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించి.. బెంచ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అసెంబ్లీలో ఆమోదం అనంతరం కేంద్రానికి పంపారు. ప్రస్తుతం కేంద్రం ఆమోదిస్తే తరలింపు పక్రీయ ప్రారంబం కానుంది. ఇక హైకోర్టు బెంచ్‌కు కర్నూల్లో శాశ్వత భవనం ఏడాదిన్నరలో ఏర్పాటు చేయనున్నారు.
న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ :
హైకోర్టు రిజిస్ట్రార్‌కు కర్నూల్లో బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ శాఖకు ఓ లేఖ రాసింది. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రభుత్వం ప్రస్తావించింది. గతంలో యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీతో పాటు సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు హైకోర్టు బెంచ్ ను కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్టార్ కు లేఖ రాశారు. 1952లో కర్నూలు భాష ప్రయుక్తంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి రాజదానిగా ఉందని, ఆ తర్వాత హైదరాబాద్ కు రాజదాని మారిందని ఈ లేఖలో ప్రస్తావించిన సంగతి విధితమే. అప్పటి నుంచి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి మారిన సంగతి విధితమే వాస్తవంగా రాయలసీమలో విభజనకు ముందు నాలుగు జిల్లాలు ఉండేవని, ఇప్పుడు 8 జిల్లాలున్నాయి. దాదాపు కోటిన్నర జనాభా ఇక్కడ నివసిస్తున్న అంశం ఈ లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది.
సీమలో జనాభా రాష్ట్ర జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ , భూభాగం 43 శాతంగా ఉంది. రాయలసీమ నుంచి అమరావతిలో హైకోర్టు దూరంగా ఉందని, కర్నూలు నుంచి కానీ కడప నుంచి విజయవాడకు ఒక్క రైలు కూడా లేదు. ఈ ప్రాంతం నుంచి వచ్చే కేసులు మూడో వంతు ఉన్నాయని, ఇవన్నీ హైకోర్టులో పెండింగ్ కూడా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని కర్నూల్లో బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉపక్రమించి అతివేగంగా చర్యలు తీసుకుంటుంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అంటూ ప్రజాగళం సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే కసరత్తు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కూటమి ప్రభుత్వం లేఖ కూడ రాయడం విశేషం.