పాత ఐటీఐ ఏటీవో ‘మత్తు’ భాగోతం!

పాత ఐటీఐ ఏటీవో ‘మత్తు’ భాగోతం!
- రోజూ కల్లు తాగి విధులకు.. మధ్యాహ్నం దాటితే అడ్రస్ లేరు
నిజామాబాదు, ఆంధ్రప్రభ క్రైమ్ : నిజామాబాదులోని పాత ప్రభుత్వ ఐటీఐ (ITI)లో అసిస్టెంట్ ట్రేనింగ్ ఆఫీసర్ (ATO)గా పనిచేస్తున్న గర్దాస్ రాజేందర్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఈ అధికారి, విధులకు వెళ్లకముందే కల్లు కాంపౌండ్‌లో మత్తులో మునిగి తేలుతూ కనిపిస్తున్నారు.
నిత్యం ఇదే తంతు.. మధ్యాహ్నం మాయం:
సదరు అధికారికి రోజూ మద్యం తాగి విధులకు హాజరు కావడం పరిపాటిగా మారిందని తెలుస్తోంది. సూర్యనగర్ పరిసరాల్లోని కల్లు కాంపౌండ్ వద్ద గంటల తరబడి గడుపుతూ, ఆ తర్వాత అదే మత్తులో కళాశాలకు వెళ్తున్నారు. ఇంతటితో ఆగకుండా, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ఆయన తిరిగి విధులకు రాకుండా మాయమవుతున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపాల్సిందేనా?
మద్యానికి బానిసైన ఈ అధికారి ప్రవర్తన వల్ల ఐటీఐ ప్రతిష్ట మసకబారడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. క్లాస్ రూమ్‌లో ఉండాల్సిన సమయంలో మత్తులో తూగుతున్న ఇటువంటి వారిని తక్షణమే విధుల్లోంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా, ఆయన పరిస్థితిని గమనించి వెంటనే డీ-అడిక్షన్ సెంటర్‌కు (మద్యం విముక్తి కేంద్రం) పంపించి చికిత్స అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందించేనా?
ఒక ప్రభుత్వ అధికారి బహిరంగంగా మద్యం సేవిస్తూ, డ్యూటీ సమయంలో గైర్హాజరవుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐటీఐ ప్రతిష్టను కాపాడటానికి గర్దాస్ రాజేందర్‌పై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
