- ప్రతిపక్ష నేతగా ఓకే
- ఇండియా టుడే- సీఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడి
(ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ) : కేంద్రంలో ఎన్టీయే సర్కారుపై జనం ముఖం మొత్తిందా? మోదీ శకం ముగుస్తోందా? అమిత్ షా (AmitShah) చక్రవ్యూహాలు భగ్నమవుతున్నాయా? ఏమో.. ఇప్పటి వరకూ పప్పు సుద్ద అని అధికార పార్టీ సంకీర్తనలో .. ఢీలా పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్రేజీ తాజాగా పెరుగుతోంది. తాను చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు ప్రజామద్దతు లభిస్తోంది. ఒక రకంగా ఇండియా కూటమి నేతగా జనం బ్రహ్మరథం పడుతున్నారు. సమర్థ నేతగా కితాబు ఇస్తూ రాహుల్ గాంధీ (RahulGandhi) కి 28.2 శాతం మంది ఓటు వేశారు. రెండో స్థానంలో మమతా బెనర్జీ నిలిచారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరు మెరుగుపడిందని జనం గ్రహించారు. ఆయన పనితీరు ‘అద్భుతం’ అని మార్కులు వేసిన జనం సంఖ్య 28 శాతానికి పెరిగింది.
గత సర్వేతో పోలిస్తే రాహుల్‌పై వ్యతిరేకత గణనీయంగా తగ్టింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే అత్యంత సమర్థుడని తాజా సర్వే (Latest survey) లో వెల్లడైంది. ఇండియా టుడే -సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో అత్యధిక మంది ప్రజలు రాహుల్ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్షాలను సమర్థంగా నడిపించగల నేత ఎవరనే ప్రశ్నకు, సర్వేలో పాల్గొన్న పౌరుల్లో 28.2 శాతం మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కి 7.7 శాతం ఓట్లతో రెండో స్థానం లభించింది.
ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (6.7 శాతం), ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) (6.4శాతం), కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (4.4 శాతం) వరుస స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే రాహుల్ గాంధీ ఆదరణ పెరగడం గమనార్హం. అప్పుడు ఆయనకు 23.9 శాతం మద్దతు లభించగా, ఇప్పుడు అది 28.2 శాతానికి చేరింది. గత ఏడాది ఆగస్టులో వచ్చిన 32.3 శాతంతో పోలిస్తే ఇది కొంత తక్కువే.
ప్రతిపక్ష నేతగా పర్వాలేదు..
లోక్‌సభ (Lok Sabha) ప్రతిపక్ష నేత గా రాహుల్ గాంధీ పనితీరుపై కూడా ప్రజల అభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయన పనితీరు ‘అద్భుతంగా’ ఉందని చెప్పిన జనం సంఖ్య ఫిబ్రవరిలో 25 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. అదే సమయంలో, ఆయన పనితీరు ‘బాగాలేదు’ (పూర్) అని చెప్పిన వారి సంఖ్య 27శాతం నుంచి 15 శాతానికి గణనీయంగా తగ్గింది. మరో 22 శాతం మంది ‘బాగుంది’ అని, 16 శాతం మంది ‘సాధారణం’ అని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే -సీఓటర్ ఈ సర్వేను 2025, జులై 1 నుంచి ఆగస్టు 14 మధ్య దేశవ్యాప్తంగా (Nationwide) అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించింది. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించింది.