డివైడర్ల పైన, ఫుట్ పాత్లపై, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలి..

డివైడర్ల పైన, ఫుట్ పాత్లపై, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలి..
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : డివైడర్ల పైన, ఫుట్ పాత్ వద్ద, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్డు, సీతారాంపురం, సాంబమూర్తి రోడ్డు, గవర్నర్ పేట, పూర్ణానందం పేట, అయోధ్య నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్ణానందంపేట, మామిడి కాయ పాక ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించి, అక్కడ వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని, డివైడర్ల పైన, ఫుట్‌పాత్‌ల వద్ద, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే విధంగా యు. సి. డి విభాగం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వసతి గృహానికి వచ్చిన తర్వాత వారికి సరైన అవగాహన కల్పించి, నైపుణ్యత కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేముల శ్యామలాదేవి రోడ్డు సీతారాంపురం వద్దున్నవిజయవాడ నగర పాలక సంస్థ మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ… నగరంలోని మరుగుదొడ్లన్నీ మరమ్మతులు లేకుండా చూసుకోవాలని, వసతుల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని పూర్తి స్థాయి లో పరిష్కరించాలని, మరుగుదొడ్ల నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.
గవర్నర్‌పేట, వెహికల్ డిపో వద్దన్న ఔటఫాల్ డ్రైన్, డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ కెపాసిటీ పెంచి మురుగునీరు ప్రవాహం లో ఎటు వంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్ వద్ద గల అన్న క్యాంటీను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి అన్నా క్యాంటీన్లో ఉన్న వసతులు, నిర్వహణ, ఆహారం నాణ్యత, ఎలా ఉంది వంటి అంశాలపై అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ప్రజలు అన్ని బాగున్నాయని చెప్పగా సంతృప్తి చెందారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, సూపరిండెంటింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) ఎం. విజయలక్ష్మి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ.శ్రీధర్, డీసీపీ చంద్రబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె.శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, బయాలజిస్ట్ కామేశ్వరరావు, సి.డి.ఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.
