భువనేశ్వర్ – ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీకి బిగ్ షాక్ తగిలింది. ప్రదీప్ మాఝీ కుటుంబాన్ని ఆయన తెగకు చెందినవారు సామాజిక బహిష్కరణ చేశారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులాంతర వివాహం చేసుకోవడం పట్ల ఆ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నట్లు భాత్రా సంఘం వెల్లడించింది. 12 ఏళ్ల వరకు ఈ సామాజిక వెలివేత అమలులో ఉంటుందని పేర్కొంది. అప్పటివరకు ప్రదీప్ మాఝీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకు భాత్రా సంఘం ప్రజలు వెళ్లరని.. ప్రదీప్ మాఝీ కుటుంబ సభ్యులు కూడా కుల సభ్యుల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావద్దని పేర్కొన్నారు.
ఒడిశాలోని నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీగా గెలుపొందిన ప్రదీప్ మాఝీ.. ఇటీవలె కులాంతర వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన సుశ్రీ సంగీత సాహూను ఆయన గోవాలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రదీప్ మాఝీపై, ఆయన కుటుంబంపై.. భాత్రా తెగకు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనను, ఆయన కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు తేల్చి చెప్పారు. ప్రదీప్ మాఝీ వయసు 48 ఏళ్లు.
ఇక ప్రదీప్ మాఝీ.. సోదరి సంజూ మాఝీ కూడా కులాంతర వివాహం చేసుకుందని భాత్రా సంఘం నేతలు తెలిపారు. సంజూ మాఝీని ఓ బ్రాహ్మణ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని.. దీన్ని తాము ఖండిస్తున్నట్లు అఖిల భారతీయ ఆదివాసీ భత్రా సొసైటీ ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రాహ్మణ కులస్థులను పెళ్లి చేసుకున్న మాఝీ కుటుంబాన్ని 12 ఏళ్ల పాటు కులం నుంచి వెలివేస్తున్నట్లు భాత్రా సంఘం తెలిపింది.
భాత్రా గిరిజన తెగకు చెందిన ఎవరు కూడా ప్రదీప్ మాఝీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వెళ్లకూడదని తమ తీర్మానంలో పేర్కొన్నారు. భాత్రా సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ గానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రదీప్ మాఝీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన గత ఏడాది ఆయన బిజూ జనతాదళ్ పార్టీలో చేరారు.