NZB | రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు !
- గత ప్రభుత్వం నియామకాలను పట్టించుకోలేదు
- గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు : మంత్రి సీతక్క
కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : తెలంగాణలో నిర్వహించిన 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్ట్కార్ హాజరయ్యారు.
గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సమాజ సేవ, పఠనాభివృద్ధి కోసం ప్రతిజ్ఞ చేశారు. పిల్లల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో చదువుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వేలాది మంది యువతకు ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన 75 వేల ఉద్యోగాల్లో గణనీయమైన శాతం లబ్ధి చేకూరింది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నోటిఫికేషన్లు రద్దు కావడం సాధారణమైపోయిందని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని నోటిఫికేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో 15,000 అంగన్వాడి ఉద్యోగాల భర్తీ చేపడతామని వెల్లడించారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో గ్రంథాలయాలు అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేక పాడుబడ్డ భవనాలుగా మారాయని విమర్శించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లో గ్రంథాలయాల వసతుల కోసం తాను స్వంతంగా నిధులు సమకూర్చిన సందర్భాలను గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రంథాలయాలు మోడల్ గ్రంథాలయాలుగా మారుతున్నాయన్నారు. తన ఎస్డిఎఫ్ నిధుల నుంచి గ్రంథాలయాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తానని చెప్పారు. విద్యార్థులకు పుస్తకాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

