న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేపై చారిత్రాత్మక విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మూడవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. బులవాయోలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఒక ఇన్నింగ్స్, 359 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి, రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చూపించిన సంపూర్ణ ఆధిపత్యం జింబాబ్వేకు భారీ ఓటమిని మిగిల్చింది. ఈ విజయం న్యూజిలాండ్‌కు టెస్ట్ క్రికెట్‌లో వారి అతిపెద్ద విజయం కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా, న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోరు సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు డెవాన్ కాన్వే (153), హెన్రీ నికోల్స్ (150 నాటౌట్), రచిన్ రవీంద్ర (165 నాటౌట్) అద్భుతమైన సెంచరీలు నమోదు చేశారు. ఈ ముగ్గురు విధ్వంస ప్రదర్శనతో న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేపై 476 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.

అరంగేట్ర అద్భుతం

రెండవ ఇన్నింగ్స్‌లో కూడా జింబాబ్వే బ్యాట‌ర్లు న్యూజిలాండ్ బౌలింగ్‌ను దాటికి నిలువ‌లేక‌పోయారు. మొత్తం 28.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యారు. న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేసిన బౌలర్ జకారీ ఫౌల్క్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి మొత్తం 9 (9-75) వికెట్లతో టెస్ట్ అరంగేట్రంలోనే రికార్డు సృష్టించాడు. అలాగే మాట్ హెన్రీ ఈ సిరీస్‌లో మొత్తం 16 వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును గెలుచుకున్నాడు.

రికార్డు విజయం

న్యూజిలాండ్ సాధించిన ఈ విజయం టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడవ అతిపెద్ద విజయం. దీని కంటే ముందు ఇంగ్లాండ్ 1938లో ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్, 579 పరుగుల తేడాతో, ఆస్ట్రేలియా 2002లో దక్షిణాఫ్రికాపై ఒక ఇన్నింగ్స్, 360 పరుగుల తేడాతో విజయం సాధించాయి.

Leave a Reply