సదుపాయాలపైనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గురి
ఆంధ్ర ప్రభ, విజయవాడ : దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహణలో ఉన్న దేవాలయాలతో పాటు ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న దేవాలయాలన్నింటిలోని సదుపాయాలను పరిశీలించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. దేవాలయాల లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఆర్డీవోలు, ఏసీపీలు, దేవాదాయ శాఖ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ మాట్లాడుతూ… ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ఎస్సై, పంచాయతీరాజ్ ఏ.ఈ, విద్యుత్ ఏఈ, ఈవో/దేవస్థానం ధర్మకర్త (ట్రస్టీ)/ఇన్స్పెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో కూడిన కమిటీ మండలాల్లోని అన్ని దేవాలయాలను పరిశీలించాలన్నారు.
దేవాలయాల్లో క్యూలైన్లు, మరుగుదొడ్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, త్రాగునీరు, పార్కింగ్, సీసీటీవీలు, సైన్ బోర్డులు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. గతంలో ఆ దేవాలయానికి వచ్చిన భక్తుల సంఖ్య, ఆయా దేవాలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉండే ప్రత్యేక రోజులు, పర్వదినాల వివరాలను తెలియజేయాలన్నారు.
ప్రతి దేవాలయంలోనూ అత్యవసర మార్గం (ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఏర్పాటు చేయాలని, ఎమర్జెన్సీ నంబర్ ను తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవాలయంలోనూ, సమీపాన ప్రమాదానికి కారణమయ్యే ప్రాంతాలను (వల్నరబుల్ పాయింట్స్) గుర్తించి ప్రమాద నివారణకు తగు సూచనలు చేయాలని చెప్పారు.
మూడు రోజులలో కమిటీ నివేదిక సమర్పించాలని, కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాల పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణం కార్యక్రమం లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.షణ్ముఖం, డిసిపి సరిత, ఆర్డీవోలు, ఏసీపీలు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


