NTR Dist. | ఘ‌నంగా మహిళా దినోత్సవ వేడుకలు !

  • అవమానాలు తట్టుకుని నిలబడే వ్యక్తిత్వం మహిళలదే
  • మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం
  • మహిళా అభ్యున్నతి కోసం చంద్రబాబు వాళ్ళ చర్యలు
  • రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : సమాజంలో అనుక్షణం అవమానాలు, అపార్ధాలను అధిగమిస్తూ సాధారణ కూలీ స్థాయి నుండి అంతర్జాతీయ కాయకి ఎదుగుతున్న మహిళలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దుర్మార్గమని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దిగమింగుకుని తట్టుకుని నిలబడే వ్యక్తిత్వం కేవలం మహిళలకే ఉందన్నారు. సమాజంలో ఇప్పటికీ బాధించబడుతున్న మహిళ లోకం పురుషులకు మార్గదర్శకంగా ఉంటున్నారని గుర్తు చేశారు.

మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు పలు విధానాలను తీసుకు వస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళల నాయకత్వం సవాళ్లు పురోగమించే మార్గాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. మహిళను విమర్శించాలంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండడం దుర్మార్గం అని తెలిపారు. ప్రతి ఇంటిలో ఆడపిల్లవి జాగ్రత్త అనే చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు రావాలన్నారు.

పోలీసులకు 6 నెలల మెటర్నటీ సెలవులను మరో 3 నెలలు పెంచడానికి కృషి చేయాలని మహిళా పోలీస్ శ్రుతి విన్నవించారు. చిన్నారులను సంరక్షిస్తూనే ప్రజలను రక్షించే వెసులుబాటు కల్పించాలని కీర్తన మహిళ విజ్ఞప్తి చేసింది.

ఇటీవల సీఎం చంద్రబాబు పిల్లలను ఎక్కువ కనడంపై చేసిన ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. ఏపీ సబ్‌ఆర్డినేట్ రూల్స్ ప్రకారం ఇద్దరికే మెటర్నటి బెన్‌ఫిట్లుండడం వల్ల వచ్చే చిక్కుల గురించి శ్రుతి తన అభిప్రాయాలను వెల్లడించింది.

ఈ సూచనలు పై స్పందించిన హోం మంత్రి అనిత మెటర్నటీ బెన్‌ఫిట్‌లను పెంచడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామన్నరు. ఆడబిడ్డలను రక్షించడంతో పాటు మగపిల్లలను సరిగ్గా పెంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అని అనిత అభిప్రాయపడ్డారు.

విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కృషిని ప్రశంసించిన హోంమంత్రి అనిత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిషనర్లు రాజశేఖర్ బాబును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి, లా అండ్ ఆర్డర్ ఏఐజీ సిద్ధార్థ్ కౌశల్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, ఏఎన్‌యూ కాలేజ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ సరస్వతి రాజు, వాసవ్య మహిళా మండలి ఛైర్మన్ చెన్నుపాటి కీర్తి, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, ఎన్టీఆర్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ కెజివి సరిత, అవేరా సంస్థ సహ వ్యవస్థాపకులు చాందిని చందన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *