NTR | ఘ‌నంగా ఎన్టీఆర్ వ‌ర్ధంతి

NTR | ఘ‌నంగా ఎన్టీఆర్ వ‌ర్ధంతి

  • రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన అన్న ఎన్టీఆర్
  • జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు

NTR | ఆంధ్రప్రభ, విజయవాడ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు దివంగత నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఉడా చైర్మన్ తుమాటి ప్రేమానంద్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. తెలుగు తేజాన్ని, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ చైతన్యానికి తెరలేపిన ఘనత ఆయనకే ద‌క్కింద‌న్నారు.

కిలో రెండు రూపాయలకే బియ్యం పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్–పట్వారి వ్యవస్థ రద్దు, కార్మికులకు పక్కా గృహాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. ఈ పథకాల ద్వారానే అన్న ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే లక్ష్యంగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగిందని తెలిపారు.

సినీ, రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజులుగా నిలిచిన అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నేడు నారా చంద్రబాబు నాయుడు పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, యువత నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply